టికెట్ల కోసం పోటాపోటీ
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లలో పోటాపోటీ
ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు టిక్కెట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ముఖ్య నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. రిజర్వేషన్లు కలిసి వస్తే తమకు పార్టీ టిక్కెట్ కేటాయించాలని కోరుతున్నారు. పార్టీ కోసం చేసిన సేవలను గుర్తు చేస్తున్నారు. పార్టీ టికెట్ వస్తే గెలుపు సులభమవుతుందని భావిస్తున్న ఆశావహులు ఎలాగైనా టికెట్ సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తు న్నారు. అన్ని ప్రధాన పార్టీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఆశావహుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను వినతులను తీసుకుంటున్న నాయకులు.. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయింపు ఉంటుందని, సర్వేల ఆధారంగా అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తామని చెబుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలు, 256 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. అలాగే మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, 72 కౌన్సిలర్ స్థానాలు, సిద్దిపేట జిల్లాలో నాల్గు మున్సిపాలిటీల పరిధిలో 75 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
బీజేపీ ముఖ్యనేతలతో టచ్‌లోకి..
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ టిక్కెట్ల రేసులో ఉన్న ఆశావహులు కొందరు బీజేపీ వైపు కూడా చూస్తున్నారు. ఒకవేళ అక్కడ టిక్కెట్ దక్కకపోతే బీజేపీ టిక్కెట్ కోసం ముందుజాగ్రత్తగా బీజేపీ ముఖ్యనేతలతో టచ్‌లో ఉన్నారు. చాలా ఏళ్లుగా ఈ పార్టీలో ఉంటూ సేవలందిస్తూ భంగపాటుకు గురైన నాయకుల నుంచి కూడా పోటీ నెలకొనడంతో బీజేపీ టిక్కెట్ల కోసం ఆశావహుల సంఖ్య రెట్టింపవుతోంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ టికెట్ దక్కని పక్షంలో తమకు టికెట్ ఇస్తే భారీగా ఎన్నికల ఖర్చు పెట్టుకుంటామని కొందరు ఆశావహులు ముందస్తుగా బీజేపీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తుండటం కమలం పార్టీ వర్గాల్లో అంతర్గతంగా కలకలం రేపుతోంది. మొత్తం మీద మూడు ప్రధాన పార్టీల్లో టిక్కెట్ల కోసం పోటా పోటీ నెలకొనడంతో బల్దియా రాజకీయం వేడెక్కుతోంది.
పార్టీ నేతల చుట్టూ చక్కర్లు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లలో తీవ్ర పోటీ
ఒక్కో కౌన్సిలర్ స్థానానికి ఇద్దరు లేదా ముగ్గురు..
భంగపడితే బీజేపీ టికెట్ కోసం ముందస్తు ప్రయత్నాలు
దీంతో కమలం పార్టీలోనూ పెరిగిన పోటీ
రెండు, మూడు రోజుల్లో రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం
అధికార పార్టీతో పాటు, ప్రధాన ప్రతిపక్ష పక్షం బీఆర్‌ఎస్‌లో టిక్కెట్ల గోల ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్కో వార్డు సభ్యుడి పదవికి ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈ వ్యవహారం ఆయా పార్టీల్లో కొంత గందరగోళానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాగైనా తాము బరిలో ఉంటామని, అవసరమైతే స్వతంత్రంగానైనా పోటీ చేయాలనే యోచనలో ఆశావహులు ఉన్నారు. దీంతో ఈ పార్టీలకు రెబల్స్ బెడద పొంచి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ క్యాడర్ రెండు, మూడు గ్రూపులుగా విడిపోయిన విషయం విదితమే. ఇప్పుడు ఇలాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వాల ఖరారు గందరగోళానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. తమ వర్గానికి టిక్కెట్లు దక్కించుకునేందుకు ఆయా నేతలు పట్టుబట్టే అవకాశాలు ఉండటంతో అధికార పార్టీ ఈ సమస్యను ఎలా అధిగమిస్తుందనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే టిక్కెట్ల ఖరారు కోసం ఒక్కో కౌన్సిలర్ స్థానం నుంచి రిజర్వేషన్లకు తగ్గట్టుగా ఆరు పేర్లు సేకరించాలని పీసీసీ ఇప్పటికే ప్రకటించింది. రిజర్వేషన్లు ప్రకటించాక టిక్కెట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు రెబల్స్ బెడద లేకుండా బీఆర్‌ఎస్ ముందు నుంచే జాగ్రత్త పడుతోంది.


