రైతులకు ఏదీ భరోసా?
● సంక్రాంతికి అందని పెట్టుబడి సాయం
● పూర్తికాని శాటిలైట్ సర్వే
● జిల్లాలో 7.43 లక్షల ఎకరాల్లో సాగు భూములు
యాసంగిలో పంటలు సాగు చేసిన రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ ఆలస్యం కానుంది. సంక్రాంతి నాటికి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం భావించింది. అయితే శాటిలైట్ సర్వే రిపోర్టు ఇంకా ఫైనల్ కాకపోవడం, సాగు భూములను గుర్తించే ప్రక్రియ పూర్తి కాకపోవడం అడ్డంకిగా మారింది. – నారాయణఖేడ్
ప్రభుత్వం వ్యవసాయ యూనివర్సిటీతో కలిసి శాటిలైట్ సర్వే ఆధారంగా పంట భూముల గుర్తించే పనుల్లో నిమగ్నమైంది. దీని ద్వారా అనర్హులకు అడ్డుకట్ట వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఈ సర్వేకు సంబంధించిన రిపోర్టు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతు భరోసా నిధుల విడుదలతో జాప్యం ఏర్పడింది. గతానికి భిన్నంగా ఈసారి వాస్తవంగా సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం అందేలా ప్రభుత్వం సరికొత్త నిబంధనలు అమలు చేస్తోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంలో అనేక లోపాటు ఉన్నట్లు గుర్తించింది. సాగుకు పనికిరాని భూములకు సైతం పంట పెట్టుబడి సాయం అందిందని తేల్చింది. ప్రజాధనం వృథా కాకుండా అడ్డుకట్ట వేసేందుకు సింథటిక్ ఎపర్చర్ రాడార్ (ఎస్‌ఏఆర్) శాటిలైట్ మ్యాపింగ్ సాంకేతికతను వాడుతోంది. దీని ఆధారంగా అనర్హులను తొలగించేందుకు క్షేత్రస్థాయిలో ఏఈఓలు రంగంలోకి దిగారు.
జిల్లాకు రూ. 422 కోట్లు
సర్వే ఆధారంగా అర్హులుగా తేలిన రైతులకు ఎకరాకు రూ. 6 వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయం పంపిణీ చేయనుంది. వానాకాలం సీజన్‌లో జిల్లాలో 3,58,863 మంది రైతులు 7,43,337 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. వీరికి ప్రభుత్వం రైతు భరోసాగా రూ. 422 కోట్లను రైతులకు పంపిణీ చేసింది. ఈ యాసంగి సీజన్‌లో దాదాపు ఇదే సంఖ్య ఉండనుంది. స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి.
26న రైతుల ఖాతాల్లోకి!
సంక్రాంతికి రైతు భరోసా పంపిణీ కాకపోవడంతో జనవరి 26 (గణతంత్ర దినోత్సవం)న ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పటికీ కాని పక్షంలో ఫిబ్రవరిలో రైతుల ఖాతాల్లో జమ చేయవచ్చని తెలుస్తోంది. సర్వే చివరి దశలో ఉన్నట్లు సమాచారం.


