సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
● ఏఐ ఆధారిత డిజిటల్ విద్యా బోధన కోసం ప్రత్యేక ప్రణాలిక
● ఓయూ వైస్ చాన్స్‌లర్ కుమార్ ములుగరం
జహీరాబాద్ టౌన్: విద్యతోనే వికాసమని ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.కుమార్ ములుగరం అన్నారు. అంబేడ్కర్ గౌరవ డాక్టరేట్ పొందిన సందర్భంగా ఆచార్య డిగ్రీ కళాశాల, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్, ఓయూ సంయుక్తంగా సోమవారం జహీరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్య అనేది కేవలం వ్యక్తిగత మార్పునకే కాకుండా.. దేశాభివృద్ధికి అత్యంత శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరిస్తున్న సమయంలో సాంకేతికత మానవాళికి ఉపయోగపడాలంటే విలువలతో కూడిన విద్యపై ఆధారపడాలని సూచించారు. ఏఐ ఆధారిత డిజిటల్ విద్యా బోధన కోసం ప్రత్యేక ప్రణాలిక రూపొందిస్తామని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి 1000 కోట్లు మంజూరు చేశారన్నారు. కొత్త ఆవిష్కరణల కోసం ఓయూను గుర్తించడం అమోఘమని చెప్పారు. హెచ్‌సీయూ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ నాగరాజు మాట్లాడుతూ.. అంబేడ్కర్ రచనలు నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. అనంతరం వైస్ చాన్సలర్ మీర్జాపూర్‌లో గల పీజీ కేంద్రాన్ని సందర్శించారు. ప్రాంతీయ విద్యా కేంద్రాలను బలోపేతం చేయడానికి త్వరలో ఓ కమిటీ వేస్తామన్నారు. కార్యక్రమంలో అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ లింగప్ప, ఓఎస్‌డీ వైస్ చాన్సలర్ జితేందర్‌నాయక్, బీసీ డైరెక్టర్ మాధవి, ఆచార్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హరికుమార్, ఉమెన్ సెల్ డైరెక్టర్ అబిదా, కళాశాల డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, నందుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎన్‌ఎస్‌ఎస్ సర్టిఫికెట్లను అందజేశారు.


