సమయపాలన పాటించాలి
కలెక్టర్ ప్రావీణ్య ఆదేశం
సంగారెడ్డి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మెడికల్ కాలేజీ, సంగారెడ్డి, జోగిపేట నర్సింగ్ కళాశాలలు, టీ–హబ్, , జోగిపేటలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులు, అవసరమైన వైద్య పరికరాలు తదితర అంశాలపై సమీక్షించారు. రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా ఆస్పత్రి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అలాగే అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సంగారెడ్డి నర్సింగ్ కాలేజీ భవన ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేయాలని టీజీఎంఐడీసీ ఈఈ రవీందర్ రెడ్డికి ఆదేశించారు. జోగిపేటలో నిర్మాణంలో ఉన్న 150 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వసంత్ రావు, అధికారులు పాల్గొన్నారు.
వయోవృద్ధుల సంక్షేమానికి చర్యలు
సంగారెడ్డి జోన్: వయోవృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. పట్టణంలోని మహిళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌ను సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా మహిళా సంక్షేమ అధికారి లలిత కుమారి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సెక్రెటరీ వనజా రెడ్డి పాల్గొన్నారు.


