ప్రజల సహకారంతోనే..
తడి, పొడి చెత్త సేకరణలో గ్రామ ప్రజల సహకారం బాగుంది. సేంద్రియ ఎరువు ప్రస్తుతం క్వింటాళ్ల కొద్దీ అందుబాటులో ఉంది. వనమహోత్సవంలో నాటిన మొక్కలకు ఈ ఎరువును వేస్తున్నాం. కిలోకు రూ.10 చొప్పున విక్రయిస్తున్నాం. రైతులు తీసుకెళ్లేందుకు వస్తున్నారు.
– స్వరూప,
పంచాయతీ కార్యదర్శి, కట్కూర్
చెత్త నుంచి సంపద సృష్టిస్తూ కట్కూరు గ్రామ పంచాయతీ ఆదర్శంగా నిలుస్తోంది. వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసి రైతులకు విక్రయిస్తూ ఆదాయాన్ని గడిస్తుంది.
– అక్కన్నపేట(హుస్నాబాద్):
ఇంట్లో చెత్త పోగైందంటే ఏం చేస్తాం..డబ్బాలో తీసుకెళ్లి బయటపడేస్తాం. చెత్తే కదా అని తీసిపారేయాల్సిన అవసరం లేదు. దాన్ని తడి,పొడిగా వేరు చేసి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని అక్కన్నపేట మండలంలోని కట్కూర్ గ్రామ అధికారులు, సిబ్బంది నిరూపిస్తున్నారు. ఉదయం ఇంటింటికీ తిరుగుతూ అధికారులు, పాలకవర్గ సభ్యులు చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందు కోసం గ్రీన్ డబ్బాలో తడి, బ్లూ డబ్బాలో పొడి చెత్తను సేకరిస్తున్నారు. దీనిపై ప్రతి వారం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబం పారిశుద్ధ్య కార్మికులకు చెత్తను ఇచ్చేలా చర్యలు చేపడుతున్నారు. తడి చెత్త(కూరగాయలు, కడిగిపారేసిన ఆకుకూరలు, పాడైపోయిన ఆహార పదార్థాలు, కుళ్లిన కూరలు) నుంచి ఎరువును తయారు చేస్తున్నారు. దీంతో కట్కూర్ స్వచ్ఛ గ్రామంగా మారుతుండటంతో పాటు ఆదాయాన్ని సృష్టించుకుంటూ జిల్లాలోని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది.
క్వింటాళ్ల కొద్దీ తయారీ..
మండలంలో మొత్తం 38 గ్రామాలు ఉండగా అందులో కట్కూర్ గ్రామం సేంద్రియ ఎరువుకు కేరాఫ్ అడ్రస్‌గా పిలుచుకుంటున్నారు. ఈ గ్రామ జనాభా సుమారు 3,512 ఉంటుంది. 1,030 ఇళ్లు ఉండగా 10వార్డులు ఉన్నాయి. ఆరుగురు పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. అయితే, ప్రతి మంగళవారం వారాంతపు సంత నిర్వహించగా, కుళ్లిన కూరగాయలు, పడేసిన ఆకుకూరలను తీసుకెళ్లి డంప్‌యార్డులోని వర్మీ కంపోస్ట్‌లో నిల్వ చేస్తారు. 45రోజుల తర్వాత సేంద్రియ ఎరువుగా మారుతుంది. ప్రస్తుతం నాలుగు క్వింటాళ్ల వరకు ఎరువు అందుబాటులో ఉంది. కాగా సుమారు 2క్వింటాళ్ల వరకు కిలో రూ.10 చొప్పున విక్రయించగా రూ.1,500 వరకు ఆదాయం వచ్చింది. ఇదే ఎరువును గ్రామంలో వనమహోత్సవంలో నాటిన మొక్కలకు వేస్తున్నారు. అలాగే మిగిలిన ఎరువును విక్రయించేందుకు అందుబాటులో ఉంచారు.


