‘శ్రమశక్తి నీతి’ రద్దు చేయాలి
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కార్మికులకు వ్యతిరేకమైన శ్రమశక్తి నీతి – 2025ను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్‌లో జరిగిన సీఐటీయూ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ ముద్రించిన ‘శ్రమశక్తి నీతి 2025 కార్మికుల కోసమా? యజమానుల కోసమా?‘ అనే బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. అనంతరం చుక్కా రాములు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మార్చేందుకే శ్రమశక్తి నీతి 2025 తీసుకొచ్చిందన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్‌లను తెచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు, ఉపాధ్యక్షుడు మాణిక్యం, కోశాధికారి కె.రాజయ్య, ఉపాధ్యక్షులు పాండురంగారెడ్డి, ప్రవీణ్, నాగేశ్వరరావు, బాగారెడ్డి, సహాయ కార్యదర్శులు మైపాల్, యాదగిరి, విద్యాసాగర్, సురేశ్, యశోద, మంజుల పాల్గొన్నారు.


