వివేకమే స్ఫూర్తిపథం
● వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి ● సేవా కార్యక్రమాల్లో యువకులు ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 980 సంఘాలు
యువత తమ విలువైన సమయాన్ని వృథా చేయకుండా, ప్రతి నిమిషాన్ని వినియోగించుకుంటే అనుకున్న గమ్యాన్ని నిర్ణిత సమయంలో సాధించవచ్చన్న వివేకానందుడి మాటలు నిజం చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది. సోషల్ మీడియాలో అధిక సమయం , ఆన్‌లైన్ గేమ్‌లతో కాకుండా, మన అభివృద్ధితో పాటు దేశాభివృద్ధి, సమాజ సేవకు సమయం కేటాయించాలి. దేశ అభివృద్ధి యువతపై ఆధారపడి ఉంది. నేడు స్వామి వివేకానందుడి జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
– ప్రశాంత్‌నగర్(సిద్దిపేట) /సంగారెడ్డి టౌన్
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 980 యువజన సంఘాలుండగా ఇందులో 14,700 మంది యువత సభ్యులుగా ఉన్నారు. వీరందరూ జిల్లాలో ప్రజాహిత, ప్రత్యేక సేవా కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా, విద్యార్థులు, యువతలో దేశ భక్తి పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. గత ఆక్టోబర్ నుంచి ఆన్‌లైన్‌లో వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా యంగ్ లీడర్ డైలాగ్ ఎంపికలు జరిగాయి. ఇందులో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. వీరు నేడు ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని నరేంద్రమోదీ ఎదుట తమ ప్రజేంటేషన్ ఇవ్వనున్నారు.
ప్రపంచానికి భారతదేశ ఆధ్యాత్మిక విలువలను చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద. ఆయన బోధనలు ఎప్పుడూ యువతకు స్ఫూర్తినిస్తాయి. ఆయన ప్రసంగాలు యువకుల్లో చైతన్యం నింపుతాయి. అందుకే ఆయన జయంతి రోజైన జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం లేదా నేషనల్ యూత్ డే నిర్వహించాలని 1984లో భారత ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి ఏటా వివేకానందుడి ఆదర్శాలు కొనసాగేలా యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజును యువ దివస్ అని కూడా పిలుస్తారు.
ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఆశించకుండా మనల్ని మనమే సంస్కరించుకోవాలని అడుగు ముందుకు వేస్తున్నారు కొంతమంది యువకులు. రక్తదానం, అన్నదానం, విద్యాదానం.. ఇలా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ పలువురికి స్ఫూర్తిని రగిలిస్తున్నారు.
వివేకమే స్ఫూర్తిపథం


