బగలాముఖిని దర్శించుకున్న ప్రముఖులు
శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రమైన శివ్వంపేటలో కొలువైన బగలాముఖీ శక్తిపీఠాన్ని ఆదివారం రాష్ట్ర హైకోర్టు లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి పంచాక్షరీ దర్శించుకున్నారు. కార్యదర్శితో పాటు నర్సాపూర్ కోర్టు న్యాయమూర్తి హేమలత పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ వ్యవస్థాపకుడు శాస్త్రుల వెంకటేశ్వరశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేసి శక్తిపీఠం విశిష్టత గురించి వారికి వివరించారు.
కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు
నంగునూరు(సిద్దిపేట): ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫ్లెక్సీని దగ్ధం చేయడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులపై ఆదివారం బీఆర్‌ఎస్ నాయకులు సిద్దిపేట పోలీస్ కమిషనర్‌తోపాటు రాజగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం నంగునూరులో విలేకరులతో మాట్లాడుతూ... నర్మేటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ మంజూరుకు కృషి చేసిన హరీశ్‌రావు ఎమ్మెల్యే హోదాలో పనులను పరిశీలించాడని తెలిపారు. కానీ, కాంగ్రెస్ నాయకులు తమ ఉనికిని చాటుకునేందకు చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలపోచయ్య, నాయకులు రమేశ్‌గౌడ్, భిక్షపతి, మల్లయ్య, కనకయ్య, మహేందర్‌గౌడ్, శ్రీధర్, పర్శరాములు, రాజేందర్, మహేందర్ పాల్గొన్నారు.
మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని రాజ్‌పేట గంగమ్మవాగులో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను శనివారం రాత్రి పట్టుకున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు.. పోలీసులు, సిబ్బంది వెళ్లి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాపర్ వైరు చోరీ
మద్దూరు(హుస్నాబాద్): గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి అందులోని కాపర్ వైరును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మండలంలోని ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మారెళ్ల లక్ష్మారెడ్డి రోజు మాదిగానే ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా అక్కడ 16కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పగులగొట్టి అందులోని కాపర్ వైరును ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. దీంతో రైతు విద్యుత్ శాఖ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులుగా మండలోని పలు గ్రామాల్లో దొంగలు ట్రాన్స్‌ఫార్మర్‌ను పగులకొట్టి కాపర్ వైరును ఎత్తుకెళ్తున్నారు. పోలీసులు నిఘా పెట్టి దొంగలను పట్టుకోవాలని రైతులు కోరుతున్నారు.
వన్య ప్రాణుల వేటగాళ్లపై ఉక్కుపాదం
దుప్పి మాంసం స్వాధీనం
రామాయంపేట(మెదక్): మెదక్ అటవీశాఖ రేంజ్ పరిధిలోని వన్య ప్రాణులను వేటాడుతున్న వారిపై ఆ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం కాట్రియాల శివారులో వన్య ప్రాణులను వేటాడుతున్న మహిళలతోపాటు కొందరి వద్ద రెండు బైక్‌లతోపాటు వలలను మెదక్ డిప్యూటీ రేంజ్ అధికారి ఖుత్బుద్ధీన్ స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో... దంతేపల్లి గ్రామ శివారులో దుప్పిని వేటాడి దానిని హతమార్చిన ఘటనలో అధికారులు గ్రామంలోని ఒక వ్యక్తి ఇంట్లో దాచిన మాంసాన్ని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు. ఇది తెలుసుకున్న మిగతావారు పారిపోయారు. ఎవరైనా వన్యప్రాణులను వేటాడినా, హతమార్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బగలాముఖిని దర్శించుకున్న ప్రముఖులు
బగలాముఖిని దర్శించుకున్న ప్రముఖులు
బగలాముఖిని దర్శించుకున్న ప్రముఖులు


