ఆశిరెడ్డి కుంట కట్ట ధ్వంసం..
పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు
వట్‌పల్లి(అందోల్): భూముల విలువ పెరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చెరువులు, కుంటల ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. అందోల్ మండల పరిధిలోని రాంసాన్‌పల్లి శివారులో గల ఆశిరెడ్డి కుంట సుమారుగా 20 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంది. కుంట శిఖం భూమిలో పట్టాలు కలిగి ఉండటంతో కొనుగోలు చేసిన రియల్ వ్యాపారి దర్జాగా పట్టపగలే కుంట కట్టను ధ్వంసం చేసి సాగుచేసే పనులు చేస్తున్నాడు. కుంటను ధ్వంసం చేయడంపై చుట్టు పక్కల రైతులు అభ్యంతరం వ్యక్తం చేసినా తన పట్టా భూమి అని, తాను ఏమైనా చేసుకుంటానని సదరు రియల్ వ్యాపారి అంటున్నట్లు పలువురు రైతులు వాపోతున్నారు. వారం రోజులుగా కుంట కట్టను ధ్వంసం చేసే పనులు చేస్తున్నా.. సంబంధిత ఇరిగేషన్, రెవెన్యూ అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువులు, కుంటల ఆక్రమణ, ధ్వంసం వంటి ఘటనలపై పత్రికల్లో కథనాలు వస్తే తప్ప ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అటువైపు కూడా చూడటం లేదని పలువురు చెబుతున్నారు. అధికారులు వెంటనే కుంట కట్ట ధ్వంసంపై చర్యలు చేపట్టి పరిరక్షించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.


