భిక్షాటన కోసం వచ్చి ..
పిలిచి అన్నం పెడితే రూ.20 వేలు అపహరణ
వట్‌పల్లి(అందోల్): భిక్షాటన కోసం వచ్చి చోరీ చేశాడు. ఈ ఘటన అందోల్ మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వని అంజయ్య ఇంటికి భిక్షాటనకు ఓ స్వామి వచ్చాడు. ఆ సమయంలో ఆయన కోడలు, మనుమరాలు మాత్రమే ఉన్నారు. తాను సమ్మక్క, సారలమ్మ నుంచి వస్తున్నానని నమ్మబలికాడు. తనకు ఆకలిగా ఉందని అన్నం పెట్టాలని కోరడంతో.. ఇంట్లో ఉన్న ఓ కుర్చీని తీసుకువచ్చి వేశారు. ఆ సమయంలో కుర్చీ కాలులో ఉన్న రూ.20 వేల నగదును చూసి వెంటనే సంచిలో వేసుకొని, ఎవరికి అనుమానం రాకుండా వారిచ్చిన రొట్టె తిని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది సేపటికి ఇంటికి వచ్చిన అంజయ్య కుర్చీ బయట కనబడటం చూసి ఒక్కసారిగా అవాక్కయాడు. పంట పెట్టుబడికి తెచ్చిన డబ్బులు కుర్చీ కాలులో దాచానని, ఇంట్లోకి వెళ్లి చూడగా డబ్బులు కనిపించలేదు. కుటుంబీకులు విషయం చెప్పగా... దొంగ స్వామికోసం వెతికాడు. అప్పటికే తాను తెచ్చుకున్న బైక్‌పై స్వామి ఉడాయించాడు. రైతు ద్విచక్ర వాహనంపై వెంబడించినా ఆచూకీ లభించకపోవడంతో నిరాశగా వెనుదిరిగాడు.
పచ్చని చెట్టుపై గొడ్డలివేటు
సంగారెడ్డి క్రైమ్: పలు గ్రామాల ప్రధాన రోడ్ల వెంట ఉన్న హరితహారం చెట్లను నరికివేస్తున్నారు. పట్టణంలోని కల్వకుంట నుంచి చిమ్నాపూర్ వెళ్లే ప్రధాన దారిలో అధికారులు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. వాటిని ఇష్టానుసారంగా నరికేస్తున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పట్టణంలో ఏ చెట్టును నరికినా అధికారులు జరిమాన విధించేవారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


