ఇక చెంతనే ఆహ్లాదం
శరవేగంగా అర్బన్ పార్క్ పనులు
● ఖేడ్ పట్టణ శివారులో నిర్మాణం● తీరనున్న ఏళ్లనాటి కల ● రూ.3.90కోట్ల వ్యయంతో ఏర్పాట్లు
అర్బన్ పార్కులో వేసిన రోడ్డు,
అటవీ ప్రాంతంలా పచ్చని చెట్లు
పట్టణంతోపాటు చుట్టుప్రక్కల గ్రామాల వాసులకు వారాంతంలో ఆహ్లాద వాతావరణంలో కుటుంబంతో గడిపేందుకు సకల సదుపాయాలతో అర్బన్ పార్కు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో ఖేడ్, దాని పరిసర ప్రాంతాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల తీరనుంది.
నారాయణఖేడ్:
పట్టణీకరణ పెరిగిపోవడం, పట్టణంతోపాటు సమీప గ్రామాల వారికి కనీసం కుటుంబం, పిల్లలతో కొంతసేపు ఉల్లాసంగా గడుపుదామన్నా ఎలాంటి సదుపాయాలు ఖేడ్‌లో లేవు. ఆ ఇబ్బందులు ఇక తీరనున్నాయి. నారాయణఖేడ్‌కు మూడు కిలోమీటర్ల దూరంలోని వెంకటాపూర్ వద్ద అటవీశాఖకు చెందిన సుమారు 350 ఎకరాల అటవీ ప్రదేశంలో అర్బన్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. రూ.3.90కోట్లతో నిర్మాణం చేపట్టనున్న ఈ అర్బన్ పార్కుకు మొదటి విడతగా రూ.90లక్షలు విడుదలయ్యాయి. వాటితో ఇప్పటికే పలు పనులను అధికారులు చేపట్టి ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.
పూర్తి సౌకర్యాలు..
అర్బన్ పార్కులో ఎనిమిది కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్, అటవీ ప్రాంతంలోపల రోడ్డు సదుపాయం, 45 అడుగుల ఎత్తున వాచ్‌టవర్, రెండు గజబో(పగోడ), రెండు ఓపెన్ జిమ్స్ నిర్మించనున్నారు. ఇదివరకే రెండు కుంటలు నిర్మించి ఉండటంతో అందులో నీటి సదుపాయం ఉంది. పశు పక్ష్యాదులు, అడవి జంతువులకోసం ఐదు సాసర్‌పిట్స్, పార్కుకు వచ్చే ప్రజల కోసం షెల్టర్, గార్డు రూమ్, టాయ్‌లెట్స్, తాగునీటి సదుపాయాలు కల్పించనున్నారు. ఎండ ఉండే సమయాల్లో ఎప్పుడూ నీరు వచ్చేలా సోలార్ బోరు డ్రిల్లింగ్ చేయనున్నారు. 36 రకాల మొక్కలతో ఖాళీ అటవీ ప్రదేశాల్లో మొక్కలను నాటనున్నారు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు కూడా చేపట్టనున్నారు. బోటింగ్ సదుపాయంతోపాటు సీతాకోక చిలుకల కోసం బట్టర్‌ఫ్లై గార్డెన్, ఔషధ రకాల మొక్కల పెంపకం, యోగ షెడ్ తదితరాల నిర్మాణాలు చేపడుతున్నారు. పార్కులో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయనున్నారు. త్వరలోనే ఈ పార్కు ప్రజలకు అందుబాటులోకి రానుంది.
త్వరలో అందుబాటులోకి..
పట్టణవాసులతోపాటు చుట్టుప్రక్కల ప్రజల సౌకర్యార్థం ఏళ్లనాటి కలగా ఉన్న అర్బన్‌పార్కు ఏర్పాటుకు ప్రత్యేకంగా కృషి చేశాను. అర్బన్ పార్కులో పనులు ముమ్మరంగా చేపట్టాలని అధికారులకు సూచించాం. తొలివిడత విడుదలైన నిధులతో పలు పనులు కొనసాగుతుండగా త్వరలో మరిన్ని నిధులు కూడా విడుదల కానున్నాయి. వాటితో పార్కు నిర్మాణం పూర్తి చేస్తాం.
– సంజీవరెడ్డి, ఎమ్మెల్యే, నారాయణఖేడ్
350 ఎకరాల్లో..
పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో 161బీ జాతీయ రహదారిపైన వెంకటాపూర్ వద్ద 350 ఎకరాల దట్టమైన అటవీ ప్రాంతంలో అర్బన్ పార్కు నిర్మాణం చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో భారీ వృక్షాలు, పచ్చని చెట్లు, పచ్చిక బయళ్లతో ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది. ఈ స్థలంలో రూ.3.90కోట్లతో అర్బన్ పార్కు నిర్మాణానికి అటవీశాఖకు ప్రతిపాదనలు పంపించగా మొదటి విడతగా రూ.1.77కోట్లకు అప్రూవ్ కాగా రూ.90లక్షలు విడుదలై డీఎఫ్‌ఓ ఖాతాలో నిధులు జమయ్యాయి. ఈ నిధులతో ఒక చెక్‌డ్యామ్, ఒక పర్కులేషన్ ట్యాంకు నిర్మాణం పూర్తయ్యింది. బోరు డ్రిల్లింగ్ చేశారు. పార్కులో వాకింగ్‌కు సంబంధించి పలు రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఈ పనులను ఎమ్మెల్యే సంజీవరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
ఇక చెంతనే ఆహ్లాదం
ఇక చెంతనే ఆహ్లాదం


