లక్ష్యం చేరుకునేనా!
ఇప్పటికే 1,300 ఎకరాల్లో సాగు మార్చి చివరి నాటికిపూర్తి చేసేందుకు చర్యలు అందుబాటులో రెండు లక్షలకు పైగా మొక్కలు ప్రోత్సాహకంగా ఎకరాకు రూ.50వేలు
ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం 3,750 ఎకరాలు
సంగారెడ్డి జోన్: ప్రస్తుతం మార్కెట్‌లో ఆయిల్‌పామ్ పంటకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈసారి ఆ పంట విస్తీర్ణం 3,750 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాలో మూడు వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతోంది. లక్ష్యంగా నిర్ణయించుకున్న 3,750 ఎకరాల్లో గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 1,300 ఎకరాల్లో సాగులో ఉండగా మిగతా 2,450 ఎకరాలు మార్చి చివరి నాటికి సాగు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పంట సాగుకు ప్రోత్సాహకాలు
పంటను సాగు చేసేందుకు ప్రతీ ఎకరాకు రైతుకు రూ.50లు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ప్రోత్సాహకరంగా అందిస్తున్నారు. మొదటి ఏడాది డ్రిప్ కోసం రూ.21,600, మొక్కలు నాటేందుకు రూ. 11,600 రాయితీ ఇస్తున్నారు. అంతర పంటలు సాగుకు నాలుగేళ్ల పాటు ప్రతీ ఏటా రూ.4,200 అందిస్తున్నారు.
నాలుగో ఏట నుంచి దిగుబడి
ఒక ఎకరాకు 57 ఆయిల్‌పామ్ మొక్కలు నాటుతున్నారు. మొదటి నాలుగేళ్లు అంతర పంటగా అన్ని రకాల పంటలు సాగు చేసుకునే సౌకర్యం ఉంది. పంట వేసిన నాలుగో ఏట నుంచి 30 ఏళ్ల వరకు పంట దిగుబడి వస్తుంది. జిల్లాలో 2023–24 నుంచి సాగు అవుతుంది. మరో నాలుగు నెలల్లో పంట దిగుబడి ప్రారంభం కానుంది.
త్వరలో ఆయిల్ యూనిట్ ఏర్పాటు
సాగు చేసిన పంట కొనుగోలు చేసి గెలల నుండి ఆయిల్ తయారు చేసేందుకు జిల్లాలో ఉత్పత్తి యూనిట్ ను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ ఆధ్వర్యంలో జహీరాబాద్ ప్రాంతంలో నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యూనిట్ ప్రారంభమైతే జిల్లాలో సాగు చేసే పంటకు మరింత డిమాండ్ పెరగనుంది.
టన్నుకు రూ.19,860 ధర
ఆయిల్ పామ్ పంట గెలలు టన్నుకు రూ.19,860లు ధర ఉంది. సంబంధిత గోద్రెజ్ కంపెనీ నేరుగా రైతు వద్దకు వచ్చి గెలలను కొనుగోలు చేస్తారు. పంటకు ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.
పొట్టి పల్లి లోని ఆయిల్ పామ్ నర్సరీ
నర్సరీలో రెండు లక్షల మొక్కలు
ఆసక్తి ఉన్న రైతులకు మొక్కలు సరఫరా చేసేందుకు జిల్లాలో ఝరాసంగం మండల పరిధిలోని పొట్టి పల్లి గ్రామ శివారులో నర్సరీని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం 2 లక్షలకు పైగా మొక్కలు అందుబాటులో ఉన్నాయి.


