రిజర్వేషన్ టెన్షన్
చైర్మన్, కౌన్సిలర్ పదవులనుఆశిస్తున్న వారిలో ఉత్కంఠ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతం నేడు ఓటర్ల తుది జాబితా
జహీరాబాద్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతం అవుతుండగా, మరోవైపు కౌన్సిలర్, చైర్మన్ పదవులను ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ పెరిగిపోతోంది. ముసాయిదా ఓటర్ల జాబితా ఇప్పటికే విడుదల కాగా, సోమవారం ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు. ఆ తర్వాత కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియను పురపాలక శాఖ పూర్తి చేయనుంది. దీంతో ఆశావాహులు, చైర్మన్, కౌన్సిలర్ పదవుల రిజర్వేషన్ ఎలా ఉంటుందనే విషయమై అంచనాలు వేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేయనుండగా, ఏయే వార్డులు ఎవరెవరికి రిజర్వు అయ్యే అవకాశం ఉంటుందనే దానిపై ఇప్పటినుంచే లెక్కలు వేస్తున్నారు. చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారు మాత్రం రిజర్వేషన్ల ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్నారు.
జనాభా ఆధారంగా
మున్సిపాలిటీల్లో చైర్మన్, వార్డుల రిజర్వేషన్లను జనాభా ఆధారంగా ఖరారు చేస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు జనాభాలో వాటా ప్రకారం స్థానాలు కేటాయిస్తారు. బీసీ రిజర్వేషన్లను కులగణన కోసం ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్ సిఫారసుల ఆధారంగా లెక్కిస్తారు. ఆపై జనరల్ స్థానాలను కూడా గుర్తిస్తారు. అన్ని కేటగిరీలలో మహిళలకు 50% స్థానాలను కేటాయిస్తారు.
ఎన్నికల సంఘం కసరత్తు
మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సంకేతాలు ఇవ్వడంతో ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాలు విడుదల చేసిన అధికారులు అభ్యంతరాల స్వీకరణ, రాజకీయ పార్టీలతో ఇప్పటికే సమావేశాలు పూర్తి చేశారు. ఈ నెల 12 ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది. తదనంతరం చేపట్టాల్సిన చర్యలపై సైతం పురపాలక శాఖ దృష్టి సారించింది.


