చెక్ ప‘వర్రీ’
కొత్త సర్పంచ్, ఉప సర్పంచ్‌లకుఇంకారాని చెక్‌పవర్ సొంత డబ్బులతో గ్రామాభివృద్ధిపనులు చేయిస్తున్న సర్పంచ్‌లు స్పెసిఫిక్ సంతకాల సేకరణ తర్వాతే వస్తుందంటున్న అధికారులు
గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాలు రెండేళ్ల తర్వాత కొలువుదీరాయి. సర్పంచ్, ఉప సర్పంచ్‌లు బాధ్యతలను స్వీకరించారు. దాదాపు రెండేళ్లుగా అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న జిల్లాలోని 613 గ్రామాలు ఈ కొత్త పాలకవర్గాలకు సమస్యల తోరణంతో స్వాగతం పలుకుతున్నాయి. మరోవైపు బాధ్యతలు స్వీకరించిన కొత్త సర్పంచ్, ఉప సర్పంచ్‌లు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు అవసరమైన నిధులు వాటి ఉపసంహరణ కోసం అవసరమైన ‘చెక్ పవర్’కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే బాధ్యతలు స్వీకరించి పక్షం రోజులు దాటినా ఇంకా వీరికి చెక్ పవర్ ఇవ్వకపోవడంతో ‘వర్రీ’అవుతున్నారు.
జహీరాబాద్ టౌన్:
సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక అధికారులకు జాయింట్ చెక్ పవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి గ్రామాభివృద్ధికి చేయాల్సిన ఖర్చుల్ని పంచాయతీకున్న బ్యాంక్ ఖాతా నుంచే నిధుల్ని ఉపసంహరించాలి. ఇప్పుడు ఈ నిధులను విత్ డ్రా చేయడానికి ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక అధికారులకున్న చెక్ పవర్‌ను కొత్తగా ఎన్నికై న సర్పంచ్, ఉపసర్పంచ్‌ల పేరిట బదిలీ చేయాలి. ఇందుకు సర్పంచ్, ఉప సర్పంచ్‌ల సంతకాలు, ఆధార్ కార్డు, పాన్‌కార్డు, వేలి ముద్రలు, ఫోన్ నంబర్లు తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతనే ఈ పక్రియ చేపట్టాల్సి ఉంది. పంచాయతీ నిధులకు సంబంధించిన అన్ని చెక్కులపై సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకం చేసిన తర్వాతే నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. రెండు సంతకాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వాటిని ఆమోదించి నిధుల విడుదలకు నిర్ణయం తీసుకోవాలని ట్రెజరీ శాఖ అధికారులను సూచించింది. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రావడానికి కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
పంచాయతీలకు ఎస్‌డీఎఫ్ నిధులు!
కేంద్ర ప్రభుత్వం పంచాయతీ ఖాతాల్లోకి నేరుగా నిధులు విడుదల చేస్తుంది. ప్రతీ మూడు లేదా ఆరు నెలలకు ఓ సారి విడుదలవుతాయి. ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లే గ్రామ పంచాయతీలకు సైతం సీఎం నిధులు నుంచి స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్(ఎస్‌డీఎఫ్) ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, మేజర్ గ్రామపంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వ నిధులు రానున్నాయి. కేంద్రం ఇచ్చే గ్రాంట్‌తో పాటు సీఎం ఇస్తామన్న ఎస్‌డీఎఫ్ నిధులు విడుదలవుతే గ్రామాల్లో నెలకొన్న కొన్ని సమస్యలైనా తొలగిపొయే అవకాశం ఉందని సర్పంచ్‌లు అభిప్రాయపడుతున్నారు.


