రెచ్చిపోతున్న కబ్జాదారులు
పటాన్‌చెరు: అమీన్‌పూర్ పట్టణంలో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి చక్కగా రిజిస్ట్రేషన్లు చేసి మున్సిపల్ అనుమతులతో దర్జాగా ఇళ్లు నిర్మిస్తున్నారు. ప్రభుత్వ భూమి పక్కనే ఉన్న లేఔట్ సర్వే నంబర్లు వేసి, ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం నిద్రపోతున్నదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటామని చెబుతున్న రెవెన్యూ అధికారులు భూములను పరిరక్షించడంలో ఒక్క అడుగు కూడా ముందుకేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కిష్టారెడ్డిపేటలోని ఓ వెంచర్‌లో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని స్పష్టంగా తెలిసినా అధికారులు నేటికీ చర్యలు తీసుకోలేదు. ఇదేమంటే సర్వే రిపోర్టు వస్తేనే కానీ చేసేదేమి లేదని చెబుతున్నారు. అమీన్‌పూర్ సర్వే నంబర్ 343లో తమకు అసైన్డ్ పట్టాలున్నాయంటూ కొందరు దర్జాగా ఫెన్సింగ్ వేస్తున్నారు. అయినా స్పందన లేదు. గతంలో ఇవే జాగాలో కనీసం ఇటుక రాయిపెట్టేందుకు జంకిన కబ్జా కోరులు ఏకంగా ఫెన్సింగ్ వేస్తున్నారు. సర్వే నం. 630, 993, 994, 996లో కబ్జాలు జరుగుతున్నాయని బీరంగూడ గ్రామ పెద్దలు మొత్తుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తాము పుట్టినప్పటినుంచి ఇవి ప్రభుత్వ భూములని, తమకు తెలుసని.. కానీ ఇప్పుడు తప్పుడు సర్వేలతో వాటిని ప్రైవేటు పరం చేశారని గతంలో వారు అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ అధికారులు మాత్రం నేటీకీ చర్యలు తీసుకోలేదు. స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసిన సమయంలో హడావిడిగా రిపోర్టులు, సర్వేల కోసం లేఖలు రాస్తున్నారే తప్ప కేసులు పెట్టడం లేదు. దీంతో కబ్జాకోరులు రెచ్చిపోతున్నారు.
కూల్చిన చోటే నిర్మించి అమ్మకాలు..
నిద్రావస్థలో రెవెన్యూ యంత్రాంగం
ప్రభుత్వ భూముల కబ్జాపై చర్యలు శూన్యం
సర్వే రిపోర్టులొచ్చాకే చర్యలు: అధికారులు
సిబ్బంది కొరత ఉంది
‘మేం ఖాళీగా లేము. ఎప్పటికప్పుడు కూల్చివేతలు చేస్తున్నాం. సిబ్బంది కొరత ఉంది. జిల్లా అధికారులకు చెబుతాం. మా పని మేం చేస్తున్నాం. కొత్తగా వచ్చిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కూల్చివేతల పనులు పర్యవేక్షిస్తున్నారు. కబ్జాలను నిరోధిస్తున్నారు. కిష్టారెడ్డిపేట రేయిన్‌బో వెంచర్స్ వ్యవహారంపై పూర్తిగా సర్వే రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకుంటాం. ఇతర కబ్జాలను కూడా గుర్తించి అన్నింటినీ కాపాడుతాం’.
– వెంకటేశ్, తహసీల్దార్, అమీన్‌పూర్
బీరంగూడ నుంచి పటేల్‌గూడ వెళ్లే దారిలో నర్రెగూడెం చౌరస్తా సమీపంలో అనేక చిరు హోటళ్లు వెలిశాయి. ఆ ప్రాంతం అంతా(డీఆర్‌ఓ) రెవెన్యూ కస్టోడియన్ జాబితాలో ఉన్న భూములు. వాటిలో తాత్కాలిక నిర్మాణాలతో అద్దెలకు ఇస్తున్నారు. సర్వే నం.969లో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని స్థానిక నాయకులు, మాజీ వార్డు సభ్యులు లింగం గౌడ్, భాస్కర్‌రెడ్డి తాజాగా మరోసారి ఫిర్యాదు చేశారు. గతంలో పట్టణ మాజీ వైస్ చైర్మన్ నందారం నర్సింహగౌడ్, బీజేపీ నేత ఆదెల్లి రవీందర్‌తో పాటు బీరంగూడ గ్రామ పెద్దలు రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉండగా సర్వే నం.993లో కబ్జాల పర్వం కొనసాగుతుంది. గతంలో ఇక్కడ ఆర్‌ఐగా పని చేసిన రఘునాథ్‌రెడ్డి నేతృత్వంలో జరిపిన కూల్చివేతల స్థానంలో నిర్మాణాలు పూర్తి చేశారు. వాటికి రంగులు వేసి అమ్మకానికి కూడా పెట్టారు.


