తప్పిపోయిన బాబు అప్పగింత
సిద్దిపేటకమాన్: తప్పిపోయిన బాబును పోలీసులు తల్లికి అప్పగించారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్ సీఐ వాసుదేవరావు వివరాల ప్రకారం... కుమురం భీం జిల్లా దాయిగాం మండలం లగ్గామ గ్రామానికి చెందిన మౌనిక నాలుగేళ్ల కుమారుడితో కలిసి సిద్దిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె చెల్లిని పరామర్శించడానికి వచ్చారు. అక్కడ మౌనిక తన తల్లితో మాట్లాడుతుండగా బాబు ఆడుకుంటూ బయటకు వెళ్లాడు. బాబు ఏడుస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బ్లూకోట్ సిబ్బంది వివరాలు అడగగా బాబు చెప్పలేదు. దీంతో బాబు ఫొటోను వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేయగా విషయం తెలుసుకున్న తల్లి స్టేషన్‌కు చేరుకుంది. వివరాలు తెలుసుకుని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బంది వెంకటరామరాజు, శ్రావణ్ బాబును తల్లికి అప్పగించారు. దీంతో తల్లి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.


