క్రీడాకారుల కోసమే సీఎం కప్
ర్యాలీని ప్రారంభించిన
మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): నేడు అంతర్జాతీయ స్థాయి లో రాణిస్తున్న క్రీడాకారులు గ్రామీణ స్థాయి నుంచి వచ్చినవారేనని, మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో సీఎం కప్ టార్చ్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గ్రామీణ స్థాయిలోని క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడానికే సీఎం కప్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికే ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిందన్నారు. యంగ్ ఇండియా స్సోర్ట్స్ యూనివర్సిటీ మాత్రమే కాకుండా జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ.. క్రీడలు జీవితంలో భాగమన్నారు. ఎంతోమంది చిన్నారులకు శక్తి, సామర్థ్యాలు ఉన్నా.. క్రీడల్లో పాల్గొనే అవకాశం రావడం లేదన్నారు. అలాంటి వారిని వెలికితీయడమే లక్ష్యంగా క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి వెంకట నర్సయ్య, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పీడీలు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
వసతి గృహం కోసం వినతి..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 600 మంది విద్యార్థులు ఉన్నారని, ప్రత్యేక వసతి గృహం ఏర్పాటు చేయాలని కళాశాల అధ్యాపకులు మంత్రి పొన్నంకు వినతి పత్రం అందించారు. దీనికి ఆయన స్పందించి, పైస్థాయి అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని చెప్పారు.
ప్రొటోకాల్ వివాదం..
జిల్లా యువజన క్రీడల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ టార్చ్ ర్యాలీ నిర్వహణలో ప్రొటోకాల్ నిబంధనలు పాటించలేదని, స్థానిక కౌన్సిలర్ అధికారులను నిలదీశారు. స్టేజీపై ఉన్న కుర్చీల్లో అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు కూర్చున్నారు. ఒకనొక దశలో మంత్రిని స్వాగతించే క్రమంలో కలెక్టర్ పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జిల్లా యువజన క్రీడల అభివృద్ధి శాఖ అధికారిని కలెక్టర్ ఈ విషయంపై వేదికపైనే హెచ్చరించారు.


