చోరీ కేసులో నిందితుడి రిమాండ్
● ఐదు కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన రామచంద్రపురం ఏసీపీ
పటాన్‌చెరు టౌన్: మల్లన్న ఆలయంలో చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి 5 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. ముత్తంగి డివిజన్ పరిధిలోని పోచారం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల 6న ఆలయ తాళాలు పగులగొట్టి స్వామివారి వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం పటాన్‌చెరు డివిజన్‌లోని మార్కెట్ రోడ్డులో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, నంబర్ ప్లేట్ లేని స్కూటీపై వచ్చిన గోకుల్ నగర్‌కు చెందిన దండు రవి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. 5 కిలోల వెండి ఆభరణాలను విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపాడు. వాటిని స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్‌కి తరలించారు. కాగా నిందితుడిపై 30 కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సీఐ వినాయక్ రెడ్డి, క్రైమ్ సీఐ రాజు, ఎస్సైలు మహేశ్వర్ రెడ్డి, అసిఫ్ అలీ పాల్గొన్నారు.


