భయమేస్తుందని.. స్నేహితుడికి ఫోన్ చేసి
చెరువులోకి దూకి ఆరోగ్య మిత్ర ఆత్మహత్య
జోగిపేట(అందోల్): కొంతకాలంగా అనారోగ్యం, మానసికంగా ఇబ్బంది పడుతూ తనకే మరణే శరణ్యమని జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్యమిత్రగా బాధ్యతలను నిర్వహిస్తున్న రవీందర్ (40) అందోలు పెద్ద చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. అందోలు మండలంలోని సంగుపేటకి చెందిన రవీందర్ ఆరోగ్యమిత్రగా పనిచేస్తున్నాడు. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత సుమను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ఆయనకు తలకు తీవ్ర గాయాలై మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ సమయంలోనే ఆదివారం భార్యను పుట్టింట్లో వదిలే పెట్టి సోమ, మంగళవారం సంగారెడ్డిలోని తన సోదరుడు మహేందర్‌తో ఉన్నాడు. అయితే బుధవారం తన మిత్రుడు నాగేందర్‌కు ఫోన్ చేసి తాను చెరువు కట్టపై ఉన్నానని చెప్పాడు. రోడ్డు ప్రమాదం జరిగినప్పటి నుంచి భయమేస్తుందని, ఉండలేకపోతున్నానని వాపోయాడు. ఆ తర్వాత వెంటనే అతని సోదరుడు మహేందర్‌కు రవీందర్ ఫోన్ చేసి చెప్పాడు. ఇంతలోనే నాగేందర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే అతని సోదరుడు జోగిపేట, అందోలు ప్రాంతంలో వెతికినా ఆచూకీ లభించలేదు. ఉదయం చెరువుకట్ట మధ్యలో మెట్ల వద్ద షర్టు, చెప్పులు గుర్తించి తన సోదరుడివేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్ల సహాయంతో రవీందర్ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


