అడవి పందుల దాడి.. మొక్కజొన్న ధ్వంసం
● రూ. 20 వేల నష్టం ● లబోదిబోమంటున్న అన్నదాత
అక్కన్నపేట(హుస్నాబాద్): రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంట అడవిపందుల దాడిలో ధ్వంసమైంది. ఈ ఘటన అక్కన్నపేట మండలం పంతుల్‌తండా గ్రామ పరిధిలోని ధరావత్‌తండాలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన ధరావత్ విజయ్ అనే యువ రైతు తన ఇంటి సమీపంలో సుమారుగా 10 గుంటల్లో మక్కజొన్న సాగు చేశాడు. రాత్రి, పగలు కంటికి రెప్పలా పంటను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో రాత్రి అడవి పందుల గుంపు ఒక్కసారిగా పంటపై దాడి చేసింది. దీంతో చేతికందే కంకులను నేలపాలు చేశాయి. సుమారుగా రూ.20 వేల నష్టం వాటిల్లిందని రైతు విజయ్ వాపోయాడు. చేసేదేమీ లేక నేలపాలైన మక్కజొన్న పంటను పశువులకు మేతగా వేశాడు. సంబంధిత అటవీశాఖ అధికారులు ఆయనకు నష్టపరిహారం వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు.


