ఒకే ఒక్కడు
డీఆర్‌ఓ పాండుకే అదనపు కలెక్టర్,ఆందోల్ ఆర్డీఓగా బాధ్యతలు ఖాళీ అయిన పోస్టుల్లో త్వరలో కొత్తవారు వస్తారంటున్న అధికారవర్గాలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : జిల్లాలో మూడు కీలక ఉన్నతాధికారి పోస్టుల్లో ఒకే ఒక్కరు కొనసాగుతున్నారు. జిల్లా రెవెన్యూ అధికారిగా నియమితులైన ఆర్.పాండు ఇప్పుడు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా, ఆందోల్ ఆర్డీఓ పోస్టుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా ఆందోల్ ఆర్డీఓగా ఉన్న ఆర్.పాండును జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ)గా నియమిస్తూ 2025 డిసెంబర్ చివరి వారంలో ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఆయన డీఆర్‌ఓగా వారం క్రితం బాధ్యతలు తీసుకున్నారు. ఖాళీ అయిన ఆందోల్ ఆర్డీఓ పోస్టులో ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. దీంతో ఈ ఆర్డీఓగా ఎఫ్‌ఏసీ (పూర్తి అదనపు బాధ్యతలు)లో పాండు కొనసాగుతున్నారు. మరోవైపు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పోస్టు కూడా గత నెలలో ఖాళీ అయింది. బి.చంద్రశేఖర్ బదిలీ అయ్యారు. దీంతో ఖాళీ అయిన ఈ పోస్టులో కూడా పాండుకే పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో మూడు కీలక పోస్టుల్లో ఒకే అధికారి కొనసాగుతున్నట్లయింది.
మాధురికి అప్పగిస్తారని అనుకున్నా...
అయితే జిల్లాలో మరో అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా మాధురి ఉన్నారు. అయితే ఖాళీ అయిన ఈ పోస్టులో అదనపు కలెక్టర్ మాధురికి అదనపు బాధ్యతలు అప్పగిస్తారని అనుకున్నారు. కానీ మాధురి కూడా పదోన్నతిపై బదిలీ అయ్యే అవకాశాలు ఉండటంతో..డీఆర్‌ఓకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
త్వరలో కొత్త అధికారుల నియామకం
అధికారుల బదిలీల్లో భాగంగా ఖాళీ అయిన ఈ కీలక పోస్టుల్లో కొత్త అధికారులను నియమిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. త్వరలో స్థానిక సంస్థల్లో ఒకటైన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇప్పటికే మున్సిపాలిటీల ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పోస్టు ఇన్‌చార్జితో నెట్టుకొస్తే ఈ ఎన్నికల నిర్వహణలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఈ పోస్టులో త్వరలోనే కొత్త అధికారిని నియమించే అవకాశాలు ఉన్నట్లు కలెక్టరేట్ వర్గాలు చెబుతున్నారు. మరోవైపు ఖాళీ అయిన ఆందోల్ ఆర్డీఓ పోస్టులో కూడా కొత్త అధికారి వస్తారని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీలు చేసే అవకాశాలున్నాయి. దీంతో ఖాళీగా ఉన్న ఈ రెండు పోస్టులు భర్తీ అవుతాయని చెబుతున్నారు.
మూడు కీలక పోస్టుల్లో...


