ఆధునిక సదుపాయాలతో సౌండ్ లైబ్రరీ
సంగారెడ్డి, మునిపల్లి(అందోల్): దృష్టిలోపం (విజువల్లీ చాలెంజ్డ్) ఉన్న వారికి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యా సమాచారం సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సంగారెడ్డి జిల్లాలో అంధుల శ్రవణ గ్రంథాలయం (సౌండ్ లైబ్రరీ)ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయంలో గురువారం అంధుల శ్రవణ గ్రంథాలయాన్ని కలెక్టర్ ప్రావీణ్య, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ నాగారం గొల్ల అంజయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఈ సౌండ్ లైబ్రరీ ద్వారా దృష్టి లోపం ఉన్న వారు కంప్యూటర్ వినియోగం, పుస్తక పఠనం, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటి కార్యకలాపాలను స్వయంగా నిర్వహించగలరన్నారు. ఈ లైబ్రరీ భారతీయ భాషల స్కాన్ అండ్ రీడ్ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. భారతీయ యాసతో స్పష్టంగా చదివే విధానం లైబ్రరీ ప్రత్యేక ఆకర్షణగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ...ఎక్కడాలేని విధంగా దృష్టి లోపం గల వారి కోసం జిల్లాలో శ్రవణ గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దివ్యాంగులు ఈ సౌకర్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ నాగారం గొల్ల అంజయ్య మాట్లాడుతూ...ప్రభుత్వ ఆలోచన మేరకు ఈ సౌండ్ లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతకుముందు లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి, జిల్లా గ్రంథాలయాల సంస్థ కార్యదర్శి వసుంధర, పంచాయతీ రాజ్‌శాఖ డీఈ దీపక్, వివిధ దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు, డీడబ్ల్యూఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య
అంధులు సౌండ్ లైబ్రరీనిసద్వినియోగం చేసుకోవాలి
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్


