ప్రయోగాలకు పైసలొచ్చాయి
ఇంటర్ విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో ప్రయోగ పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. గతేడాది ఒక్కో కళాశాలకు రూ.25వేల చొప్పున విడుదల చేసిన ప్రభుత్వం ఈసారి అందుకు రెట్టింగాపు ఒక్కో కళాశాలకు రూ.50వేల చొప్పున కేటాయించింది. ప్రయోగ పరీక్షల పరంగా ఇబ్బందులు పడే విద్యార్థులకు ఆ ఇబ్బందులు తొలగిపోయాయి. పరీక్షా సమయంలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ముందస్తుగా నిధులను విడుదల చేసింది. జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ఒక్కో కళాశాలకు రూ.50వేల చొప్పున జిల్లాకు రూ.10లక్షల నిధులను ప్రభుత్వం కేటాయించారు.
– నారాయణఖేడ్:
కొన్ని చిన్న కళాశాలలు మరికొన్ని విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న కళాశాలలున్నాయి. దీంతో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటం, కొన్ని కళాశాలల్లో చాలా పరికరాలు లేకపోవడంలాంటి సమస్యలు నెలకొన్నాయి. ఏయే కళాశాలలకు ఎలాంటి పరికరాలు కావాలి, ఏయే రసాయనాలు అవసరం ఉంది అనే అంశాలపై ఆయా కళాశాలల వారీగా డీఐఓ ద్వారా కలెక్టర్ నివేదిక తెప్పించుకోనున్నారు. ఈ నివేదిక ప్రకారం డిస్ట్రిక్ పర్చేజ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రాక్టికల్స్‌కు ఏ కళాశాలకు ఏమేమి అవసరమవుతాయో ఆ మేర కొనుగోళ్లు చేయనున్నారు. ఇంటర్ బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు థియరీతోపాటు ప్రాక్టికల్ తరగతులు కూడా ఉంటాయి. తరగతుల నిర్వహణ సందర్భంగా విద్యార్థులు ప్రాక్టికల్స్ స్వయంగా చేస్తూ నేర్చుకోవాల్సి ఉంటుంది. గత 9 ఏళ్లుగా కళాశాలల ప్రాక్టికల్స్‌కు ఎలాంటి నిధులు విడుదల కాలేదు. దీంతో విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయించడం గాలిలో దీపంలానే ముగించారు. గతేడాది నుంచి ప్రాక్టికల్స్‌కు నిధుల విడుదల ప్రారంభమైంది. కాగా, ఈ నిధులు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విడుదల చేస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
కలెక్టర్ పర్యవేక్షణలో కొనుగోళ్లు


