ఆలు..ధర దిగాలు
పంట చేతికొచ్చాక తగ్గిన ధర 1,500 ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు జోరుగా సాగుతున్న పంటతీత పనులు
సంగారెడ్డి జోన్: ఆరుగాలం కష్టపడి మంచి లాభాలు వస్తాయని ఎంతో ఆశతో సాగు చేసిన రైతులకు తీవ్ర నిరాశే మిగులుతోంది. ప్రస్తుతం జిల్లాలో ఆలు పంట సాగు చేసిన రైతులకు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వానకాలం సీజన్‌లో కురిసిన భారీ వర్షాలకు పత్తి పంటతో ఇతర పంటలు నష్టపోయారు. అనంతరం సాగుచేసిన ఆలు రైతులకు ప్రకృతి అనుకూలించినా మార్కెట్ మాత్రం అనుకూలించడం లేదు. దీంతో నష్టాలు చూడాల్సి వస్తుంది. ఈ నష్టాలతో రైతుల పరిస్థితి మూలిగేనక్కపై తాటిపండు పడిన చందంగా తయారైంది.
పంట కోత సమయంలోనే పతనం
పంట సాగు చేసే సమయంలో మంచి ధర ఉండటంతో పంట కోత సమయంలో ధరలు అమాంతంగా పడిపోతున్నాయి. నిలకడగా ధరలు లేకపోవడంతో మార్కెట్‌కు వెళ్లేంత వరకు ధర ఏంటో తెలుసుకోలేక పోతున్నారు. పంట సాగు సమయంలో క్వింటాలుకు రూ.3 నుంచి రూ.4 వేల వరకు పలికింది. ప్రస్తుతం అందుకు భిన్నంగా పంట నాణ్యతను బట్టి రూ.1000 నుంచి రూ.1,500 వరకు పలుకుతుంది. ధర పెరుగుతుందేమోనని ఆశతో కొంతమంది రైతులు వేచి ఉండగా మరికొంతమంది రైతులు మాత్రం ఉన్న కొద్దిపాటి ధరకే మార్కెట్‌కు తరలిస్తున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి
దిగుమతితోనే..
రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పంట హైదరాబాద్ మార్కెట్‌కు తరలుతోంది. అయితే పంట మొత్తం ఏకకాలంలో రావడం...పొరుగు ప్రాంతాల నుంచి సైతం దిగుమతులు పెరగడంతో స్థానికంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు
ఆలు పంట సాగు చేసేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల్లోని నేలలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్‌కల్, రాయికోడ్, మనూర్, మునిపల్లి, మొగుడంపల్లి ప్రాంతాలలో ఎక్కువగా సాగవుతోంది. ప్రతీ ఏటా పంట సాగుకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఒక ఎకరాకు సుమారు రూ.80 వేల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం ఒక ఎకరా సాగు చేసిన పంట అమ్మితే రూ.1.20లక్షలు మాత్రమే వస్తుందని రైతులు వాపోతున్నారు.
పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు
గిడ్డంగులు లేక అమ్మకాలు..
చేతికొచ్చిన పంట నిలువ ఉంచేందుకు స్థానికంగా కోల్డ్ స్టోరేజీలు లేకపోవడంతో అమ్ముకోవాల్సి వస్తుంది. జిల్లాలోని పలుచోట్ల ఉన్నప్పటికీ కిరాయి ఎక్కువగా ఉండటంతో ఉంచుకోలేకపోతున్నారు. స్థానికంగా స్టోరేజ్‌లు ఉంటే మంచి ధర వచ్చినపుడు అమ్ముకునేందుకు వీలుంటుందని రైతులు చెబుతున్నారు.
ఆలు..ధర దిగాలు


