కూడవెల్లి జాతరను ఘనంగా నిర్వహిద్దాం
● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ● ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష
దుబ్బాక: రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన కూడవెల్లి జాతరను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం దక్షిణకాశీగా ప్రసిద్ధి గాంచిన అక్భర్‌పేట–భూంపల్లి మండలం రామేశ్వరంపల్లిలోని కూడవెల్లి రామలింగేశ్వర జాతర ఈ నెల 18న ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశముందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రతను మరింత మెరుగుపర్చాలని ,తాత్కాలిక మరుగుదొడ్లు, అంబులెన్స్, ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు , విద్యుత్, రహదారులు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, సీసీ టీవీల ఏర్పాటు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఊషయ్యగారి రాజిరెడ్డి, ప్రధాన అర్చకులు సాకేత్‌శర్మ, డైరెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.


