గులాబీయింగ్ ఫలించేనా!
పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గంలో రాజకీయ గందరగోళ పరిస్థితి నెలకొంది. గ్రామాలు పట్టణ ప్రాంతాలుగా మారాయి. మున్సిపాల్టీలు గ్రేటర్‌లో విలీనమయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రామస్థాయి నాయకులకు రాజకీయ అవకాశాలు దెబ్బతిన్నాయి. స్థానిక ఎమ్మెల్యే తీరుతోనూ స్థానికంగా రాజకీయ నాయకుల్లో అయోమయం నెలకొంది. ఏ గ్రామంలో ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఇతర పార్టీల ప్రభావం పెద్దగా లేదు. అయితే బీఆర్‌ఎస్ క్యాడర్ తమ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరారనే కారణంగా అయోమయంలో పడింది. దీంతో వారందరూ మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కారు గుర్తుపై పోటీ చేసి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అనుచరవర్గం తీవ్ర గందరగోళంలో పడింది. బీఆర్‌ఎస్ నుంచి తమకు బీఫామ్‌లు అందే అవకాశం లేదనే ఉద్దేశ్యంతో వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారని స్థానికంగా తామంతా కాంగ్రెస్‌లోనే ఉన్నామని ఎమ్మెల్యే అనుచరులు ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. అయితే ఇటీవల స్పీకర్ ఇచ్చిన తీర్పుతో ఆయన బీఆర్‌ఎస్‌లోనే కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్‌లో మాత్రం ఆయనకు రీ ఎంట్రీ లేదని ఆ పార్టీ వర్గాలు బలంగా చెబుతున్నాయి. ఇదిలాఉండగా త్వరలో పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అనుచరులు ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే అంశంపై స్పష్టత లేదు. దీంతో కొందరు నాయకులు ఇతర పార్టీలవైపు దృష్టి సారించారు. క్యాడర్‌ను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే కొత్త ఎత్తుగడ వేశారని చెప్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ప్రజలతో సత్సంబంధాలున్నాయి. ఆయన తన అనుచరులను కాపాడుకునేందుకు ఇటీవల ఓ సమావేశాన్ని నిర్వహించి వారందరినీ బీఆర్‌ఎస్ పార్టీలో చేరాలనే సంకేతాలు ఇచ్చారని చెప్తున్నారు.
ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డి ఇటీవల స్థానిక నేతలతో కలిసి వెళ్లి బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఇది తాజాగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొత్తమ్మీద గతంలో బీఆర్‌ఎస్‌లో పనిచేసిన వారందరూ మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. నియోజకవర్గంలో గతంలో కారు గుర్తుపై పోటీ చేసి ఆపై కాంగ్రెస్‌లో చేరిన తాజా మాజీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు ఇతర ముఖ్య నాయకులంతా గూడెం మధుసూదన్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
సర్పంచ్ కావాలనే ఆశలు ఆవిరి
నియోజకవర్గంలో 55 గ్రామ పంచాయతీలు ఉండేవి. అందులో ఇప్పుడు 11 పంచాయతీలు మాత్రమే మిగిలాయి. ఇటీవల ఆ పదకొండు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఆ 55 పంచాయతీల్లో సర్పంచ్‌లుగా ఉన్న వారు, ఈసారి ఎలాగైనా సర్పంచ్‌లుగా కావాలని కలలు కన్న వారి ఆశలు ఆవిరయ్యాయి. గ్రామాల సంగతి అలా ఉండగా, పటాన్‌చెరు నియోజకవర్గంలో గ్రేటర్‌లో విలీనం కాక ముందు మూడు మున్సిపాల్టీలు కలిపి 64 వార్డులు ఉండేవి. అలా మున్సిపాల్టీల్లోని కౌన్సిలర్లకు ఎక్కడ నుంచి పోటీ చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు అమీన్‌పూర్‌లో 24 మంది కౌన్సిలర్లు ఉండగా ఇప్పుడు అదే విస్తీర్ణంలో అన్ని వార్డులు కలిపి నాలుగు డివిజన్లుగా మారాయి. దాంతో కౌన్సిలర్లుగా పని చేసిన వారిలో చాలామంది ప్రజాసేవ నుంచి రిటైర్ తీసుకోవడం తప్ప వేరే అవకాశం లేదని చెప్తున్నారు.
పటాన్‌చెరులో రాజకీయ గందరగోళం
ఎమ్మెల్యే సోదరుడి ఆధ్వర్యంలో
బీఆర్‌ఎస్‌లోకి రీ ఎంట్రీ ప్లాన్
పట్టణీకరణ నేపథ్యంలో
గ్రామ రాజకీయాలకు ఫుల్‌స్టాప్


