టికెట్ల ఖరారుకు కమిటీలు
సమన్వయ కమిటీలు వేసిన బీఆర్‌ఎస్
మున్సిపాలిటీల వారీగా
కాంగ్రెస్ కమిటీలు
ఇన్‌చార్జిలను నియమించిన బీజేపీ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పురపాలక పోరుకు సిద్ధమైన పార్టీలు అభ్యర్థిత్వాల ఎంపికపై పూర్తిగా దృష్టి సారించాయి. ఆయా మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ స్థానాల టికెట్ల ఖరారుకు కసరత్తు చేస్తున్నాయి. ఎలాగైనా మున్సిపాలిటీలపై తమ పార్టీల జెండాలను ఎగురవేసేందుకు గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నాయి. ఎన్నికల సంఘం అధికారులు మున్సిపాలిటీల ఓటరు జాబితా సవరణ ప్రక్రియను చేపట్టిన విషయం విదితమే. దీంతో ఈ ఎన్నికల నిర్వహణ దిశగా వడివడిగా అడుగులు పడుతున్న తరుణంలో ప్రధాన పార్టీలు ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేశాయి. పంచాయతీ ఎన్నికల మాదిరిగా కాకుండా, మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరుగుతుండటంతో పార్టీలు మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
బీఆర్‌ఎస్ సమన్వయ కమిటీలు..
కౌన్సిలర్ అభ్యర్థిత్వాల ఖరారుపై బీఆర్‌ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. జహీరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి నలుగురు సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఇటు సంగారెడ్డి, సదాశివపేట పురపాలక సంఘాల్లో కౌన్సిలర్ అభ్యర్థుల ఖరారు కోసం ఎమ్మెల్యే చింతప్రభాకర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇటీవల ఆ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు.
కమిటీలు వేసిన కాంగ్రెస్
పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాల్లో పాగా వేసిన కాంగ్రెస్ పార్టీ ఇదే ఊపుతో బల్దియా ఎన్నికలకు సై అంటోంది. సంగారెడ్డి నియోజకవర్గంలో మున్సిపాలిటీల వారీగా నలుగురు సభ్యులతో కమిటీని నియమించింది. ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుని టికెట్లను ఖరారు చేసే బాధ్యతలను సంగారెడ్డి నియోజకవర్గంలో ఈ కమిటీ సభ్యులకు అప్పగించినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు.
ఒక్కో స్థానానికి ముగ్గురు చొప్పున..
పార్లమెంట్, శాసన మండలి ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ మున్సిపాలిటీలను కై వసం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఒక్కో కౌన్సిల్ స్థానానికి ముగ్గురు చొప్పున (బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు అనుగుణంగా) ఆశావహుల జాబితాలను సిద్ధం చేస్తోంది. ఆ పార్టీలోకి కొందరు ముఖ్య నేతలకు ఈ బాధ్యతలను అప్పగిస్తూ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే సంగారెడ్డి నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు, పటాన్‌చెరు నుంచి ఐదు మున్సిపాలిటీల్లో ఈ కసరత్తు జోరందుకుంది.
పోటాపోటీగా సన్నాహాక సమావేశాలు..
మున్సిపల్ పోరు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఆయా బల్దియాలపై తమ పార్టీల జెండాలను ఎగురవేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. టికెట్ల ఖరారుపై దృష్టి సారిస్తూనే మరోవైపు పార్టీ శ్రేణులను ఈ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ మున్సిపాలిటీల్లోని వార్డుల వారీగా ఆశావహులతో సోమవారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. సంగారెడ్డితోపాటు, సదాశివపేటల్లో జరిగిన ఈ సన్నాహక సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ సైతం శ్రేణులను సిద్ధం చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాలులో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. మరోవైపు బీజేపీ సైతం ఈ సన్నాహాక సమావేశాలు నిర్వహించింది. సంగారెడ్డితో పాటు, పటాన్‌చెరు నియోజకవర్గాల కమలం పార్టీ ముఖ్య నేతలకు ఇటీవల పటాన్‌చెరు ఐబీలో జరిగిన సమావేశంలో ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
పురపోరుకు అభ్యర్థిత్వాల ఎంపికపై
దృష్టి సారించిన ప్రధాన పార్టీలు


