ఐటీఐ విద్యార్థులకు అప్రెంటిషిప్ మేళా
హత్నూర (సంగారెడ్డి): హత్నూర ఐటీఐలో ఈ నెల 12న ఐటీఐ విద్యార్థులకు అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ రాఘవేందర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలో గల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలో ఉత్తీర్ణులైన అన్ని ట్రేడ్ల విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఆన్‌లైన్‌లో పేర్లను నమోదు చేసుకోవాలని బయోడేటాతో పాటు సంబంధిత విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలను స్వయంగా ఐటీఐలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 984 9546979కు సంప్రదించవచ్చని తెలిపారు.
పెండింగ్‌లో ఉన్న
భూ సమస్యలు పరిష్కరించాలి
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి
సంగారెడ్డి జోన్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అట్రాసిటీ కేసులలో బాధితులకు చెల్లించాల్సిన పెండింగ్ నిధుల కోసం వెంటనే ప్రతిపాదనలు పంపాలన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రోత్సాహకం, అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా కావాల్సిన నిధులకు ప్రతిపాదనలు పంపితే వాటిని మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
పట్టాపాస్ పుస్తకాలు పంపిణీ
పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన పది మంది ఎస్సీ రైతులకు డ్రాఫ్ట్ పాస్‌బుక్‌లను అందజేశారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, శంకర్, అదనపు కలెక్టర్లు మాధురి, పాండు, అదనపు ఎస్పీ రఘునందన్‌రావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అఖిలేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు నిబంధనలు
పాటించడం తప్పనిసరి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి సౌజన్య
సంగారెడ్డి టౌన్: రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సంగారెడ్డి ఆధ్వర్యంలో రోడ్ సురక్ష అభియాన్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని సంగారెడ్డిలోని ఆంథోని కళాశాలలో మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రోడ్డు నియమాలను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా రవాణ అధికారి అరుణ, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ సమన్వయ
కమిటీ నియామకం
జహీరాబాద్: రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సమన్వయ కమిటీని బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు ఈ మేరకు మంగళవారం సమన్వయ కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించారు. మాజీమంత్రి టి.హరీశ్‌రావు ఆదేశాల మేరకు కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కమిటీలో ఎం.డి.తంజీం, నామ రవికిరణ్, మొహియొద్దీన్, బండి మోహన్, ఆర్.సుభాష్‌లకు స్థానం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్‌రావు సమన్వయ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. కష్టపడి పనిచేసి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధికంగా గెలిపించుకోవాలని సూచించారు.
ఐటీఐ విద్యార్థులకు అప్రెంటిషిప్ మేళా


