పండుగకు 503 ప్రత్యేక బస్సులు
● సంక్రాంతి నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్పెషల్ సర్వీసులు ● ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు
సంగారెడ్డి టౌన్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాధారణ సర్వీసులతో పాటుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 503 ప్రత్యేక బస్సులను అదనంగా నడపనుంది. జనవరి 9 నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది ఆర్టీసీ డిపోలలో అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. బస్సుల సంఖ్యను పెంచడంతో కొంతమేర ప్రయాణికులకు ఇబ్బందులు తప్పనున్నాయి. మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత రవాణ సౌకర్యం ఉండటంతో దీనికి అనుకూలంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నాను. ఈనెల 11, 12, 13 ప్రత్యేక బస్సులు ఉంటాయి. పండుగరోజుల్లో సాధారణ బస్సులు నడవడంతో తిరుగు ప్రయాణంలో 16,17,18,19,20 తేదీలలో ప్రత్యేక బస్సులు నడపనున్నారు. కళాశాలలకు, ఉద్యోగాలకు వెళ్లే వారికి సెలవులు ఉండటంతో సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆయా డిపోల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. గ్రామాలకు వెళ్లడానికి ప్రత్యేకంగా బస్సులు కావాలన్నా, విహార యాత్రలకు కూడా ప్రత్యేకంగా బస్సులను పంపిస్తున్నారు.
డిపో పేరు ప్రత్యేక బస్సులు
మెదక్ 26
నారాయణఖేడ్ 112
నర్సాపూర్ 29
సంగారెడ్డి 103
జహీరాబాద్ 52
సిద్దిపేట 95
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 63
దుబ్బాక 23
రద్దీ పెరిగితే మరిన్ని సర్వీసులు
సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలకు వెళ్లే వారికోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాం. రద్దీ పెరిగితే మరిన్ని బస్సులను ఏర్పాటు చేస్తాము. ప్రతి డిపోలలో సలహాలు సూచనల కోసం కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. గ్రామాలకు వెళ్లే వారికి ప్రత్యేకంగా బస్సులు కావాలన్నా కూడా అందుబాటులో ఉంచుతాం.
– విజయ్ భాస్కర్, ఆర్టీసీ ఆర్‌ఎం.
పండుగకు 503 ప్రత్యేక బస్సులు


