సమర్థవంతంగా నిర్వహించాలి
● మున్సిపల్ ఎన్నికలపై కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి జోన్: రానున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పి.ప్రావీణ్య సూచించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం నియమితులైన నోడల్ అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో ప్రావీణ్య సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ఎన్నికల సంఘం ఆదేశాలను అధికారులు పాటించాలన్నారు.
జిన్నారంలో ఆకస్మిక తనిఖీలు
జిన్నారం(పటాన్‌చెరు): జిన్నారం పట్టణ కేంద్రంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. 2012 నుంచి కొత్త ఓటర్ల నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. బోగస్ ఓట్లను తొలగించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. వచ్చే నెలలో జరగనున్న వార్షిక పరీక్షలకు సంసిద్ధం కావాలని తెలిపారు. కళాశాలలో ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్ కృష్ణకుమార్ కలెక్టర్‌కు విన్నవించారు. అనంతరం పక్కనే ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి తరగతి గదులను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ దేవదాసు, కమిషనర్ తిరుపతి, ఎస్సై హనుమంత్, ఆ యా శాఖల అధికారులు పాల్గొన్నారు.


