ఖేడ్‌లోనే ఎంవీఐను ఏర్పాటు చేయండి
నారాయణఖేడ్: రవాణ శాఖకు సంబంధించి ఎంవీఐ శాఖను నారాయణఖేడ్‌లో ఏర్పాటు చేసి ఈ ప్రాంత వాసుల ఇబ్బందులు దూరం చేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ..తన కోరిక మేరకు ఏడాది కాలంగా ప్రతీ గురువారం జహీరాబాద్ ఎంవీఐ ఇక్కడకు వచ్చి వాహనాల ఫిట్‌నెస్ చేస్తున్నారన్నారు. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, బీమా తదితరవాటి కోసం జహీరాబాద్ వెళ్లక తప్పడంలేదని చెప్పారు. రోడ్లు బాగాలేక ప్రమాదాలు జరుగుతుండగా అంతదూరం వెళ్లి లైసెన్సులు తీసుకోవడానికి యువత ఆసక్తి చూపడంలేదని వెల్లడించారు. ఖేడ్‌లో ఎంవీఐ శాఖ ప్రతిపాదన పంపగా కమిషనర్ వద్ద పెండింగులో ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఫొటో క్యాప్చర్‌లో ఇబ్బందులతో చాలామందికి బిల్లులు అందడంలేదని, ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జుక్కల్ నియోజకవర్గంలో ఉన్న కౌలాస్ నాలా ప్రాజెక్టు ఉందని సింగూరు నుంచి కంగ్టి మండలానికి మిషన్ భగీరథ నీరందించడంలో ఇబ్బందులు ఎదురవుతుండగా కౌలాస్‌నాలా ప్రాజెక్టు వద్ద రూ.20 కోట్ల వరకు వెచ్చించి ఫిల్టర్ బెడ్‌లను ఏర్పాటుచేస్తే జుక్కల్, ఖేడ్ నియోజకవర్గాల్లోని 100 గ్రామాల వరకు తాగునీటిని అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం అందుకు కృషి చేయాలని కోరారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి


