చట్టబద్ధ ప్రయోజనాలతో పరిహారం
సంగారెడ్డి జోన్: పరిశ్రమల ఏర్పాటులో భూములు కోల్పోయే రైతులకు చట్టబద్ధ ప్రయోజనాలతో పరిహార అవార్డులు అందించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కలెక్టరేట్‌లో నిమ్జ్, రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులతో భూసేకరణపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...పరిశ్రమల అభివృద్ధికి భూసేకరణ కీలకం అన్నారు. భూములు ఇచ్చిన రైతులకు చెల్లించాల్సిన పరిహార అవార్డుల్లో ఎలాంటి ఆలస్యం జరగకూడదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. మొత్తం 12,635 ఎకరాల భూమి అవసరం కాగా, ఇప్పటివరకు 6,500 ఎకరాల భూసేకరణ పూర్తయినట్లు వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ మాధురి, నిమ్జ్ ప్రత్యేక అధికారి విశాలాక్షి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ రతన్ రాథోడ్ సంగారెడ్డి, జహీరాబాద్ ఆర్డీఓ రాజేందర్, దేవుజాతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 42 దరఖాస్తులు
ప్రజావాణి కార్యక్రమానికి 42 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టరేట్‌లో అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ, పింఛన్, భూ తగాదాలు, పంచాయతీరాజ్ వ్యవసాయ శాఖలతో పాటు తదితర శాఖలపై ఫిర్యాదులు చేశారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, వీఆర్వో పాండు ఉన్నారు.
ముందస్తు సమాచారం అందించాలి
సింగూరు డ్యామ్ మరమ్మతులపై కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి జోన్: సింగూర్ డ్యామ్ మరమ్మతుల నేపథ్యంలో నీటిని ఖాళీ చేసే సమయంలో ముందస్తుగా రైతులు, ప్రజలకు సమాచారం అందించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. డ్యామ్ మరమ్మతుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రజలకు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు.
కలెక్టర్ ప్రావీణ్య
ప్రతిభ చూపిన విద్యార్థులకు అవార్డులు
జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావోకార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో విద్యా, క్రీడా రంగాలలో పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు అందించారు.


