గాంధీ పేరు తీసేసి కేంద్రం తప్పు చేసింది
ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనం ముగింపు సభలో ఎంపీ సురేశ్ షెట్కార్
సంగారెడ్డి: ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తీసేసి కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందని ఎంపీ సురేశ్ షెట్కార్ విమర్శించారు. నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో మూడురోజులపాటు జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా ఆదివాసీ కార్యకర్తల, నాయకుల శిక్షణ శిబిరం సమావేశాలు సోమవారం ముగిశాయి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ సురేశ్ షెట్కార్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ సురేశ్ షెట్కార్ మాట్లాడుతూ...ఉపాధి హామీ పనుల పథకం నుంచి గాంధీ పేరును కేంద్ర ప్రభుత్వం కావాలనే తీసేసిందని, ఈ చర్యకు నిరసనగా పార్లమెంట్‌లో పోరాడుతామన్నారు. పేదలకు ఉపాధి కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. నిర్మలారెడ్డి మాట్లాడుతూ...నారాయణఖేడ్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. దేశ స్వాతత్య్రం కోసం పోరాటం చేయని వారు గాంధీ బొమ్మను తొలగించాలని కుట్ర చేస్తున్నారని ఇలాంటి కుట్రలను ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ శిక్షణ శిబిరంలో కార్యకర్తలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆదివాసీల హక్కులు, సంక్షేమ పథకాలపై అవగాహన ప్రధాన ఎజెండాగా రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్, నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్‌జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


