భూములకు హద్దులు చూపండి
నర్సాపూర్ రూరల్: దళితుల భూములకు హద్దులు చూపాలని డిమాండ్ చేస్తూ సోమవారం నర్సాపూర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ మహిపాల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి నందన్ మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం శివ్వంపేట మండలం ఎదుల్లాపూర్‌కు చెందిన 24 మంది దళితులకు 20 గుంటల చొప్పున సర్వే నంబర్ 108లో 12 ఎకరాల భూమికి సంబంధించి పట్టాదారు పాస్‌బుక్‌లు అందజేసి నేటికీ హద్దులు చూపలేదన్నారు. ఇదే మండలం చిన్నగొట్టుముక్కలలో 26 మంది దళితులకు ప్రభుత్వం 50 ఎకరాల 20 గుంటల భూమిని కేటాయించి పట్టాలు ఇచ్చిందని, ఆ భూముల్లోకి అటవీ శాఖ అధికారులు లబ్ధిదారులను రానివ్వడం లేదని ఆరోపించారు. గంగాయపల్లి, పాంబండ గ్రామాల్లోని భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


