‘మోడల్ పార్లమెంట్’కు రెఢీ
● వర్గల్ నవోదయలో సర్వం సిద్ధం ● పోరుకు గుజరాత్, కేరళ విద్యార్థులు ● హాజరుకానున్న ప్రముఖులు
నేడు జాతీయస్థాయి పోటీలు
వర్గల్(గజ్వేల్): జాతీయస్థాయి యూత్‌పార్లమెంట్ పోటీలకు ఉమ్మడి మెదక్‌జిల్లా వర్గల్ నవోదయ సిద్ధమైంది. విద్యార్థులలో ప్రజాస్వామ్య విలువల పెంపు, చట్టాలు, వాటి రూపకల్పన, నాయకత్వ లక్షణాలు పెంపు, సామాజిక స్థితిగతులపై అవగాహన ధ్యేయంగా ప్రతి సంవత్సరం నవోదయ విద్యాలయ స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు ఈ పోటీలు జరుగుతాయి. ఇందులో భాగంగా 27వ జాతీయస్థాయి యూత్ పార్లమెంట్ (మోడల్ పార్లమెంట్) పోటీలకు వర్గల్ నవోదయ వేదికగా నిలుస్తున్నది. ఆకట్టుకునే స్వాగత తోరణాలతో పోటీలకు ముస్తాబై అతిథులకు, ఆయా జట్లకు ఆహ్వానం పలుకుతోంది.
వర్గల్ నవోదయ వేదికగా యూత్ పార్లమెంట్ పోటీలకు ముఖ్యఅతిథులుగా మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, భారతప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ డిప్యూటీ సెక్రటరీ అనీల్‌కుమార్, నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ కమిషనర్ అభిజిత్ బేరా, భోపాల్ రీజియన్ అసిస్టెంట్ కమీషనర్ డీకే సింగ్, న్యూఢిల్లీ విద్యాలయ సమితి ఏఎస్‌ఓ అంకిత్ ముద్గల్ హాజరవుతున్నట్లు స్థానిక నవోదయ ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ తెలిపారు. పోటీలు తిలకించి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారన్నారు. విజేతగా నిలిచిన జట్టు జాతీయ స్థాయి పోటీలకు అర్హతసాధిస్తుందన్నారు.


