కుక్కల దాడిలో రెండు జింకల మృతి
దుబ్బాకటౌన్ : సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిమ్మక్‌పల్లి గ్రామ పరిసరాల్లో కుక్కల దాడిలో రెండు జింకలు మృతి చెందాయి. ఆదివారం కలకలం రేపిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామ శివారులో మేత కోసం వచ్చిన జింకలపై వీధి కుక్కలు గుంపుగా దాడి చేయడంతో అక్కడికక్కడే రెండు జింకలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంటనే అటవీ శాఖ బీట్ ఆఫీసర్లు వేణు, జహంగీర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతిచెందిన జింకల మృతదేహాలను పంచనామా నిర్వహించి దౌల్తాబాద్ పంపించారు. తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. గ్రామాలలో వీధి కుక్కల సంఖ్య పెరగడంతో చిన్న పిల్లలకు, వన్య ప్రాణులకు తీవ్ర ముప్పు ఏర్పడుతోందని అటవీ అధికారులు తెలిపారు.


