పది వేల మందికి ఉద్యోగాల కల్పన
నర్సాపూర్: నియోజకవర్గంలో రాబోయే మూడేళ్లలో పది వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాజన్న ఎంప్లాయిమెంట్ సెల్ ఏర్పాటు చేసినట్లు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో రాజన్న ఎంప్లాయిమెంట్ సెల్ అఫిషియల్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పేజీని ప్రారంభించి మాట్లాడారు. నిరుద్యోగులకు అండగా ఉంటూ ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రక్రియను నిరంతరం కొనసాగించడానికి ఎంప్లాయిమెంట్ సెల్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. నిరుద్యోగులు తమ విద్యార్హతలను ఆన్‌లైన్ ద్వారా పంపించవచ్చన్నారు. పార్టీలకు అతీతంగా ఈ సెల్ పని చేస్తుందని తెలిపారు. హెచ్‌ఆర్ కో సంస్థ సహకారంతో సెల్ పని చేస్తుందని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు వారికి అవసరమైన స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ సైతం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో హెచ్‌ఆర్ కో సంస్థ భాగస్వామి కార్తిక్, ఫౌండేషన్ ప్రతినిధి మారుతిరావు, కాంగ్రెస్ నాయకులు రాజుయాదవ్, రిజ్వాన్, నగేష్, సుధీర్‌గౌడ్, రషీద్, హర్షవర్ధన్, రవిగౌడ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


