మా గోడు శాసనసభలో వినిపించండి
మల్లన్న సాగర్ భూబాధితులు
గజ్వేల్‌రూరల్: తాము ఎదుర్కొంటున్న సమస్యలను శాసనసభలో వినిపించి పరిష్కారానికి చొరవ చూపాలని మల్లన్నసాగర్ భూ బాధితులు మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్‌కు స్పీడ్ పోస్టు ద్వారా లేఖను పంపించారు. అదే విధంగా హైద్రాబాద్‌లో ఎమ్మెల్సీ కోదండరామ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుధవారం వారు మాట్లాడుతూ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి చెందిన మల్లన్నసాగర్ భూ బాధితులమైన తమకు ఇంకా పూర్తిస్థాయిలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందలేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సరైన ఉపాధి అవకాశాలను కల్పించకపోవడంతో ఆర్థికంగా సతమతమవుతూ దుర్భర పరిస్థితులు నెలకొంటున్నామని వాపోయారు. ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో మల్లన్నసాగర్ భూబాధితుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లన్నసాగర్ భూబాధితులు పాల్గొన్నారు.


