గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి రిమాండ్
కొండపాక(గజ్వేల్): అద్దె ఇంట్లో ఉంటూ గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు తొగుట సీఐ లతీఫ్ తెలిపారు. కుకునూరుపల్లి పోలీస్‌స్టేషన్‌న్‌లో బుధవారం సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెస్ట్‌బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఎస్‌కే రాకిబుల్ అనే వ్యక్తి ఆరేళ్ల నుంచి లకుడారం గ్రామంలోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ ఒక్కరే నివాసం ఉంటున్నారు. రాకిబుల్‌కు గంజాయి తాగే అలవాటు ఉండటంతో హైదారాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసుకొని చాటు మార్గంగా సేవిస్తున్నాడన్నారు. ఈక్రమంలో కూలీ పనులు సరిగా దొరకకపోతుండటంతో కొనుగోలు చేసిన గంజాయి ప్యాకెట్ నుంచి కొన్ని విత్తనాలను తీసి అద్దెకుంటున్న ఇంటి వెనకాల నాటారు. మొక్కలు పెరిగి ఆకులు వేశాయన్నారు. ఆకులను తీసి ఎండబెట్టి పొడిగా తయారు చేసుకొని సిగరెట్‌పై చల్లుకొని తాగుతున్నాడు. 10 రోజులుగా గజ్వేల్ మండలంలోని సింగాటం గ్రామంలో ఉంటున్నప్పటికీ లకుడారంలో ఉంటున్న అద్దె ఇంటికొచ్చి గంజాయి మొక్కలకు నీరు పోసి వెలుతున్న తీరులపై నమ్మదగిన సమాచారం మేరకు కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ అద్దెకుంటున్న ఇంటిని పరిశీలించి 140 గ్రాముల గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారన్నారు. మంగళవారం రోజున స్థానిక బస్టాండ్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారన్నారు. దీంతో నిందితుని కోర్టులో హాజరుపర్చగా జడ్జి తీర్పు మేరకు రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.


