ధాన్యం బస్తాల చోరీ
లబోదిబోమంటున్న రైతన్నలు న్యాయం చేయాలని వేడుకోలు
అక్కన్నపేట(హుస్నాబాద్): గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దొంగలు పడ్డారు. ఒకేరోజు ఐదారు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. మండలంలోని రామవరం, గండిపల్లి, పోతారం(జే), కుందనవానిపల్లి, మంచినీళ్లబండ గ్రామాల్లోని ఐకేపీ, సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటైన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలను దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే, రామవరం గ్రామానికి చెందిన పడిగాల శ్రీనివాస్‌రెడ్డికి చెందిన 4 బస్తాలు, మహ్మద్ కాశీంకు చెందిన 4 ధాన్యం బస్తాలు రాత్రి సమయంలో చోరీకి గురయ్యాయి. బస్తా 40కిలోల చొప్పున వీరిద్దరూ రైతులు కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. కాగా ధాన్యం తరలించకుండా అధికారులు కొనుగోలు కేంద్రంలోనే బస్తాలను ఉంచారు. తెల్లవారుజామున ధాన్యం బస్తాలను దొంగలు ఎత్తుకెళ్లారన్న విషయంతో ఇరువురు రైతులతో పాటు గ్రామ సర్పంచ్ బొమ్మ శ్రీశైలం, నాయకులు ప్రభాకర్, కనకయ్య, ఐకేపీ సిబ్బంది తదితరులు కొనుగోలు కేంద్రాలకు చేరుకొని పరిశీలించారు. కాగా దొంగతనం జరిగిన ఘటనపై రైతు మహ్మద్ కాశీం పోలీసులను ఆశ్రయించారు. రెక్కలు, ముక్కలు చేసి పండించిన పంట, కొనుగోలు కేంద్రంలో విక్రయించిన తర్వాత దొంగతనానికి గురైందని, న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
దొంగల భయం..
చీకటి పడితే చాలు రైతన్నలకు దొంగల భయం పట్టుకుంది. రెండు, మూడు రోజుల నుంచి వరుసగా కొనుగోలు కేంద్రాలే టార్గెట్‌గా దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. రైతులు విక్రయించిన ధాన్యం బస్తాలను గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే మాయం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో దొంగల హల్‌చల్


