యథేచ్ఛగా కబ్జా!
రైతులకు సాగు నీరు అందించేందుకు నిర్మించిన తపాస్‌పల్లి రిజర్వాయర్ కాలువల భూములు, వాటి వెంట ఉన్న రోడ్లు ఆక్రమణకు గురవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇదే అదునుగా భావించిన కొందరు ఆక్రమించి సాగు కూడా చేస్తున్నారు. అయినాపూర్ శివారులో రోడ్డును ఆక్రమించి అడ్డుగా సిమెంట్ పలకలతో గోడ సైతం నిర్మించారు. ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
– కొమురవెల్లి(సిద్దిపేట)
తపాస్‌పల్లి రిజర్వాయర్..
కాలువల భూములు, రోడ్ల ఆక్రమణ
చేర్యాల, కొమురవెల్లి, బచ్చన్నపేట, కొండపాక మండలాల రైతులకు సాగునీటిని అందించేందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను నిర్మించింది. ఈ రిజర్వాయర్ నుంచి రైతులకు నీరు అందించేందుకు అనుసంధానంగా రిజర్వాయర్‌కు ఎడమ, కుడి భాగంలో డీ1, డీ2, డీ3 , డీ4 కాలువల నిర్మాణాన్ని చేపట్టి భూ నిర్వాసితులకు సైతం నష్టపరిహారం చెల్లించారు. అయితే కాలువల నిర్మాణం పూర్తవడంతో ప్రతి సంవత్సరం నీటిని కూడా విడుదల చేస్తున్నారు. కాగా కొంత కాలంగా సాగు, తాగు నీటి అవసరాలు, బహుల ప్రయోజనాల కోసం చేపట్టిన తపాస్‌పల్లి రిజర్వాయర్ కాలువలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అధికారులు దృష్టి సారించక పోవడంతో రిజర్వాయర్ కాలువలను కబ్జా చేస్తున్నారు. డీఈఈ కార్యాలయం జనగామ, ఈఈ కార్యాలయం స్టేషన్‌ఘనపుర్ , ఎస్‌ఈ కార్యాలయం హన్మకొండ, సీఈ కార్యాలయాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండటంతో దూరభారం పెరిగి అధికారుల పర్యవేక్షణ లోపించింది. ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమార్కులు కాలువలకు అనుకోని ఉన్న భూమిని, రోడ్లను ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారు. ఈ తంతు గడిచిన మూడేళ్లుగా సాగుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మండలంలో కబ్జాలు
తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు అనుసంధానంగా ఉన్న కాలువలు పోసాన్‌పల్లి, అయినాపూర్, గౌరాయపల్లి, మర్రిముచ్చాల , కిష్టంపేట గ్రామాల మీదుగా కాలువలు వెళుతున్నాయి. కొంత మంది యథేచ్ఛగా కాలువ భూములు, రోడ్లను ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారు. మరి కొంతమంది రోడ్డును ఆక్రమించి అడ్డుగా సిమెంట్ పలకలతో ప్రహరీని కట్టారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు.
అయినాపూర్ శివారులో కాలువ రోడ్డుకు సిమెంట్ పలకలతో అడ్డుగా కట్టిన గోడ
పంటలు సాగు చేస్తున్న వైనం
మూడేళ్లుగా సాగుతున్న తంతు
చోద్యం చూస్తున్న ఇరిగేషన్‌అధికారులు
పలు మార్లు ఫిర్యాదు చేశాం
తపాస్‌పల్లి రిజర్వాయర్ కాలువలు ఆక్రమణకు గురవుతున్నాయని ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి కాలువ భూములను కాపాడాలి. కాలువ వెంట ఉన్న రోడ్ల ఆక్రమణను అరికట్టాలి.
– దండ్యాల వెంకట్ రెడ్డి, అయినాపూర్
చర్యలు తీసుకుంటాం
కాలువ భూములు ఆక్రమణకు గురైనట్లు ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. డీఈఈ కార్యాలయం జనగామలో ఉండటంతో పర్యవేక్షణకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను సిద్దిపేట జిల్లా ఇరిగేషన్ అధికారులకు అప్పగించాలని ఉన్నతాధికారులకు విన్నవించిన ఫలితం లేదు.
– అంజయ్య, ఇరిగేషన్ డీఈ


