దారి కోసం రైతుల ఆందోళన
చిన్నశంకరంపేట(మెదక్): పంట పొలాలకు దారి ఇవ్వాలని రైతులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నార్సింగి మండలం శంకాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా... శంకాపూర్ గ్రామ రైతుల పొలాలకు అడ్డంగా ఓ రియల్టర్ పలకలు ఏర్పాటు చేసి గేట్‌పెట్టి తాళం వేశాడు. దీంతో వెనకవైపు పొలాలు ఉన్న రైతులకు దారిలేకుండా పోయింది. రహదారికి ఆనుకుని భూములు కొనుగోలు చేసిన రియల్టర్ వెనకవైపు రైతులను కూడా తమ భూములు అమ్మాలని కోరడంతో రైతులు అమ్మేందుకు ముందుకు రాలేదు. దీంతో వెనకవైపు రైతులు వెళ్లకుండా తాను కొనుగోలు చేసిన భూముల చుట్టూ పలకలు ఏర్పాటు చేశాడు. గేట్ పెట్టడంతో పాటు తాళం వేయడంతో రైతులకు దారిలేక దున్నకాలకు ట్రాక్టర్ వెళ్లలేని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న తహసీల్దార్ గ్రేసిభాయి అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. పంటల దున్నకాలు పూర్తిచేసుకుని వరి నాట్లు వేసేవరకు తాళం తీయిస్తామని, తిరిగి యజమానికి అప్పగించాలని చెప్పారు. రైతులు మాత్రం తమకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
నచ్చజెప్పిన తహసీల్దార్


