పులి జాడ కోసం అన్వేషణ
సిద్దిపేటకమాన్: సిద్దిపేట జిల్లా తొగుట అటవీప్రాంతంలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచరించినట్లు స్థానికులు తెలపడంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. బస్సాపూర్ డంపింగ్ షెడ్ ప్రాంతం, తొగుట మండలం గోవర్ధనగిరి, కొండాపూర్, గుడికందుల, వర్ధరాజ్‌పల్లి పరిధిలో పెద్దపులి సంచరించినట్ల ఫారెస్ట్ అధికారులు పాదముద్రల ద్వారా ప్రాథమికంగా పులిగా నిర్ధారించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ పద్మజారాణి మాట్లాడుతూ..గ్రామానికి చెందిన స్థానికుడు పెద్దపులి కనిపించినట్లు తెలపడం ద్వారా ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది సంబంధిత గ్రామాలకు వెళ్లి పంట పొలాల్లో పరిశీలించినట్లు తెలిపారు. పులి పాదముద్రలను గుర్తించామని, మూడు రోజులుగా జాడను గుర్తించడానికి పులి సంచరించిన ప్రాంతాల్లో 15 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పులిని పట్టుకోవడానికి ఆరు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి 45మంది ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది 24గంటలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గొర్రెల కాపరులు, పశువుల కాపరులు, వ్యవసాయ పనులకు వెళ్లే వారు ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు. డ్రోన్ కెమెరాలతో కూడా అటవీ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తడోబా టైగర్ రిజర్వ్ (ఎన్‌టీసీ) నుంచి ఇద్దరు నిపుణులు నేడు సిద్దిపేటకు రానున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని, త్వరలోనే పులి జాడను గుర్తిస్తామని డీఎఫ్‌ఓ పద్మజారాణి తెలిపారు.
15 కెమెరాలతో నిఘా
ఆరు టీంలు, 45 మంది సిబ్బందితో పెట్రోలింగ్
నేడు తడోబా టైగర్ రిజర్వ్ నుంచి నిపుణుల రాక
డీఎఫ్‌ఓ పద్మజారాణి


