షట్టర్ల తాళాలు పగులగొట్టి..
రూ.2.95 లక్షల నగదు, 9 తులాల వెండి ఆభరణాల చోరీ
కొల్చారం(నర్సాపూర్): మెదక్ – జోగిపేట రహదారిపై ఉన్న దుకాణాల్లో నాలుగు షట్టర్ల తాళాలు పగులగొట్టి దొంగ రూ.2.95 లక్షల నగదు, 9 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. ఈ సంఘటన మండలంలోని ఎనగండ్ల గ్రామపంచాయతీ దుంపలకుంట చౌరస్తాలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహమ్మద్ మైనొద్దీన్, బాధితుల కథనం ప్రకారం... దొంగ తాను వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్‌తో షట్టర్ల తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డాడు. మణికంఠ మొబైల్ షాపులో రూ.70వేల నగదుతో పాటు 20 వేల విలువైన ఫోన్లు చోరీ చేశాడు. పక్కనే ఉన్న మల్లికార్జున డ్రెస్సెస్‌లో రూ.15వేల నగదుతో పాటు పదివేల విలువైన వస్త్రాలను దొంగిలించాడు. మహేశ్వర మెడికల్ స్టోర్‌లోకి వెళ్లి కౌంటర్‌లో ఉన్న రూ.30వేల నగదు, నాలుగు తులాల పట్టా గొలుసులు ఎత్తుకెళ్లాడు. రోడ్డుకు మరో పక్కన ఉన్న వీరభద్ర కిరాణంలో దొంగ కౌంటర్లో దాచిన రూ.1.80 లక్షల నగదుతో పాటు 5 తులాల పట్టా గొలుసులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి చిత్రం రికార్డయింది. ఘటనా స్థలాన్ని క్రైమ్ బ్రాంచ్ పోలీస్ అధికారి రాజశేఖర్ సందర్శించి, క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు.


