కుటుంబ కలహాలతో మేసీ్త్ర ఆత్మహత్య
మనోహరాబాద్(తూప్రాన్): జీవితంపై విరక్తి చెంది మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ వివరాల ప్రకారం... మండలంలోని రంగాయపల్లి గ్రామానికి చెందిన రాజబోయిన శ్రీనివాస్, భార్య రేఖతో కలిసి జీవనం సాగిస్తున్నారు. కాగా వీరికి ఇద్దరు కుమారులున్నారు. వీరిలో చిన్న కుమారుడు ప్రేమ వ్యవహారంలో కొన్ని రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలతో జీవితంపై విరక్తి చెందిన శ్రీనివాస్(45) ఆదివారం రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. కాగా అతని గురించి వెతకగా సోమవారం గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆర్థిక ఇబ్బందులు తాళలేక..
హవేళిఘణాపూర్(మెదక్): ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని వాడి గ్రామానికి చెందిన ఇమ్మడి నర్సింహులు(60) ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేశాడు. దీంతో అవి ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు కుటుంబీకులకు చెప్పగా వారు వచ్చి చూసేసరికి అప్పటికే మృతి చెందాడు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య ఎంకవ్వ, కుమారుడు ఉన్నాడు.


