బతుకులు గొయ్యి పాలాయె..
అశ్రు నయనాలతో
అంత్యక్రియలు
ముగ్గురిని మింగిన వంతెన గుంత
● మూడు కుటుంబాల్లో తీరని విషాదం
● శోక సంద్రమైన నర్సాపూర్ గ్రామం
నారాయణఖేడ్: వంతెన కోసం తవ్విన గొయ్యి మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో రాత్రి సమయంలో ద్విచక్రవాహనం నేరుగా గొయ్యిలోకి దూసుకెళ్లి ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. నిజాంపేట– నారాయణఖేడ్– బీదర్ 161బీ జాతీయ రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. విస్తరణలో భాగంగా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని డబుల్‌బెడ్‌రూం ఇళ్ల సమీపంలో పెద్ద వంతెన నిర్మించడానికి భారీ గోయ్యిని తవ్వారు. లోతుగా తవ్విన గొయ్యిలో నీళ్లు సైతం చేరాయి. పక్కనుంచి మళ్లింపు రోడ్డు వేసి గొయ్యి చుట్టూ రాత్రుల్లో మెరిసేలా రేడియంతో కూడిన దిమ్మెలు, రిబ్బన్ కట్టారు. తవ్విన మట్టిని ఇరువైపులా పోశారు. నారాయణఖేడ్ మండలం నర్సాపూర్‌కు చెందిన అవుటి నర్సింహులు (27), జిన్న మల్లేశ్ (24), జిన్న మహేశ్ (23) తమ బంధువును నారాయణఖేడ్‌లో వదిలేందుకు శనివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చారు. బంధువును వదిలి ఒక ద్విచక్రవాహనాన్ని అతడివద్దే ఉంచి, ముగ్గురూ మరో ద్విచక్ర వాహనంపై నర్సాపూర్‌కు బయలు దేరారు. వంతెన కోసం తవ్విన గొయ్యిలోకి వాహనం దూసుకెళ్లి అందులో పడగా ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో జిన్న మల్లేశ్, జిన్న మహేశ్ వరుసకు సోదరులు కాగా అవుటి నర్సింహులు మల్లేశ్‌కు బావ అవుతారు. నర్సింహులు వివాహితుడు కాగా మిగిలిన ఇద్దరు అవివాహితులు.
ఆందోళనతో తండ్రి ఆరా..
గోయ్యిలో మృతదేహాలు
బంధువును నారాయణఖేడ్‌లో విడిచి పెట్టి రావడానికి వెళ్లిన వారు గంటలు గడిచినా తిరిగి రాకపోవడంతో ప్రమాదమేమైనా జరిగిందా? అనే అనుమానంతో మహేశ్ తండ్రి భూమన్న మరొకరితో కలిసి నారాయణఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రికి వచ్చి ఆరా తీశారు. ప్రమాద బాధితులు లేకపోవడంతో గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అనుమానంతో వంతెన కోసం తవ్విన గొయ్యిలోకి టార్చిలైటు వేసి చూడగా అందులో వాహనం, మృతులు కనిపించారు. పోలీసులు, గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాలను గొయ్యిలోంచి తీశారు.
నర్సాపూర్‌లో విషాద ఛాయలు
లక్ష్మి, భూమన్న దంపతులకు మహేశ్ ఒక్కడే కుమారుడు కాగా అవివాహితుడైన అతను ఖేడ్‌లో ఇంటర్ చదువుతున్నాడు. వీరమణి, విఠల్ దంపతులకు కుమారుడు మల్లేశ్, ముగ్గురు కూతుళ్లు సంతానం. కాగా ఓ కూతురును అదే గ్రామానికి చెందిన అవుటి నర్సింహులుకు ఇచ్చి వివాహం చేశారు. ప్రమాదంలో ద్విచక్ర వాహన మెకానిక్‌గా పనిచేస్తున్న కుమారుడు మల్లేశ్ తోపాటు అల్లుడు నర్సింహులు మృతి చెందారు. నర్సింహులు వ్యవసాయం చేస్తూ జీవిస్తుండగా అతడి మృతితో భార్య మమత, రెండేళ్లు, ఏడునెలల వయస్సున్న కూతుళ్లు అనాథలయ్యారు.
గోతిలోకి బైక్ దూసుకెళ్లడంతో మరణించిన సమీప బంధువులైన ముగ్గురి అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య నిర్వహించారు. మృతుల స్వగ్రామమైన ఖేడ్ మండలం నర్సాపూర్‌లో ఆదివారం సాయంత్రం ఒకేసారి అంత్యక్రియలకు తరలించడంతో గ్రామస్తులతో పాటు బంధువులు, సమీప గ్రామాల వారు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందు రోజు వరకు కళ్లముందు కదలాడిన యువకులు మరణించడం, ముగ్గురు అంత్యక్రియలు ఒకే సారి నిర్వహించడంతో గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చి, కంట తడిపెట్టించింది.
బతుకులు గొయ్యి పాలాయె..


