నకిలీ ఓసీలతో నయాదందా!
యథేచ్ఛగా విద్యుత్ కనెక్షన్ల జారీ
● రూ.లక్షల్లో దండుకున్న అధికారులు
● ముగ్గురు ఏఈలు, మరో ఏడుగురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
● కొనసాగుతున్న అంతర్గత విజిలెన్స్ విచారణ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: విద్యుత్ కనెక్షన్ల జారీలో అధికారుల అవినీతి వెలుగులోకి వచ్చింది. నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు (ఓసీ)లు సృష్టించి అపార్టుమెంట్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, విల్లాలు, భారీ నివాస భవనాలకు విచ్చల విడిగా విద్యుత్‌కనెక్షన్లు జారీ చేశారు. కొన్నింటికి ఈ సర్టిఫికేట్లు లేకుండానే నిబంధనలకు విరుద్దంగా కనెక్షన్లు కట్టబెట్టారు. ఈ వ్యవహరంలో ఆశాఖలోని కొందరు అధికారులు రూ.లక్షలు దండుకున్నారు. కాంట్రాక్టర్లతో కలిసి ఈ భారీ అక్రమాలకు తెరలేపడంతో ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండిపడింది. నిబంధనల ప్రకారం ఓసీ ఉంటేనే విద్యుత్ కనెక్షన్‌లు ఇవ్వాలి. కానీ నకిలీ ఓసీలు సృష్టించి కనెక్షన్లు ఇచ్చేశారు. ప్రధానంగా సంగారెడ్డి డివిజన్ పరిధిలో ఇస్నాపూర్, పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని పటాన్‌చెరు రూరల్, అమీన్‌పూర్ మండలాల్లో ఈ నకిలీ ఓసీల దందా ఎక్కువగా సాగినట్లు తెలుస్తోంది. మునిపల్లి మండలంలోనూ ఈ నకిలీ ఓసీలతో విద్యుత్ కనెక్షన్లు జారీ వ్యవహరం వెలుగు చూసింది. ఈ దందాలో సంబందిత మండలాల్లోని ఆపరేషన్ విభాగంలోని లైన్‌ఇన్స్‌పెక్టర్లు, లైన్‌మెన్లు, ఏఎల్‌ఎంలు కూడా ఈ వసూళ్ల దందాలో భాగస్వామ్యులుగా ఉన్నారు.
షోకాజ్ నోటీసులు..
ఈ నకిలీ ఓసీలతో విద్యుత్ కనెక్షన్లు జారీ చేసిన వ్యవహరాల్లో ప్రస్తుతానికి మూడు మండలాల అసిస్టెంట్ ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. మరో ఏడుగురు లైన్‌మెన్లు, ఏఎల్‌ఎంలు, ఇతర సిబ్బందికి కూడా ఈ నోటీసులు ఇచ్చారు. నిర్ణీత సమయంలోగా వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులు జారీ అయిన అధికారుల్లో ఒకరిద్దరు పదవీ విరమణ చేసినట్లు తెలుస్తోంది. ఓ అఽధికారి తన రిటైర్డ్‌మెంట్‌కు దగ్గరలో ఉన్నప్పుడు అందినంత దండుకుని పదవీవిమరణ చేసినట్లు తెలుస్తోంది.
విజిలెన్స్ విచారణ సైతం..
విద్యుత్‌శాఖ డిస్కంకు, మరోవైపు ప్రభుత్వ ఆధాయానికి రూ.కోట్లలో గండిపడటంతో ఈ నకిలీ ఓసీల వ్యవహరంపై డిస్కం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై ఆశాఖ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ విభాగం అధికారులు ఈ నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లతో జారీ అయిన విద్యుత్ కనెక్షలపై విచారణ చేపట్టారు. క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు. ఎన్ని నకిలీ సర్టిఫికేట్లు ఉన్నాయానే దానిపై హెచ్‌ఎండీఏ, ఇతర సంస్థలకు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. ఈ విచారణ పూర్తయితే మరికొందరు అధికారుల అక్రమాల బాగోతం వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.
నిబంధనల ప్రకారం చర్యలు
నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లతో విద్యుత్ కనెక్షన్లు జారీ వ్యవహరంపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. ఈ విజిలెన్స్ విభాగం క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తోంది. సంబంధిత అధికారులు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశాం. వారు ఇచ్చే వివరణ, విచారణ నివేదిక ఆధారంగా తదుపరి నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయి.
– సుధీర్‌కుమార్,
పర్యవేక్షక ఇంజనీర్, విద్యుత్‌శాఖ


