నష్టాల సాగు
● భారీ వర్షాలతో పంటలకు నష్టం
● యూరియా కోసం ఇబ్బందులు
● పెరిగిన పెట్టుబడి.. తగ్గిన దిగుబడి
● విత్తనోత్పత్తికి నాణ్యమైన విత్తనాలు
ఈ ఏడాది రైతులకు తీవ్ర నిరాశే
జిల్లాలో ఎక్కువగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఎంతో ఆశతో మంచి లాభాలు వస్తాయనుకొని పంటలు సాగుచేసిన రైతన్నకు ఈ ఏడాది కలిసి రాక తీవ్ర నిరాశే మిగిలింది. పండుగలా సాగాల్సిన సాగు అధిక వర్షాలతో అన్నదాతలకు నష్టాలను మిగిల్చింది. – సంగారెడ్డి జోన్
7లక్షల ఎకరాల్లో పంటల సాగు
జిల్లాలో 7లక్షల 24 వేల 432.07 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. వరి 1,57,496, చెరుకు 22,462.38, సోయాబీన్ 60,706, కందులు 74,813.24తో పాటు ఇతర పంటలు సాగవుతున్నాయి. గతేడాది కంటే ప్రస్తుత ఏడాది పత్తి పంట సుమారు 20వేల ఎకరాల విస్తీర్ణంలో అధికంగా సాగు చేశారు. అలాగే చెరుకు పంట సాగు విస్తీర్ణం సైతం పెరిగింది. చిరు ధాన్యాల సాగు మాత్రం తగ్గింది.
19 వేల ఎకరాల్లో నష్టం
సీజన్ ప్రారంభం నుంచి ముగిసే వరకు వర్షాలు దంచికొట్టాయి. మూడు విడతల్లో 21,119 మంది రైతులకు సంబంధించి 19,557.39 ఎకరాల విస్తీర్ణంలో పంటలకు నష్టం వాటిల్లింది. 33 శాతం పైబడి పంట పాడైతేనే ఆ పంట నష్టంగా గుర్తించారు. పలు చోట్ల పంట పొలాలు నీట మునగడంతో పాటు కోతకు గురయ్యాయి.
తగ్గిన దిగుబడులు
కురిసిన అధిక వర్షాలతో పంటలకు తెగుళ్లు విపరీతంగా సోకాయి. వాటి నివారణకు అనేక సార్లు మందులు పిచికారీ చేశారు. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్లు రావాల్సిన పత్తి కేవలం 6 క్వింటాల్ కు మాత్రమే పరిమితమైంది. దిగుబడులు తగ్గడంతో పాటు పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగి రైతులకు గుదిబండగా మారాయి. పత్తి తీత సమయంలో కురిసిన వర్షాలకు బరువు తగ్గిపోయింది. దీంతో కూలీల రేట్లు పెరిగిపోయాయి.
అందుబాటులోకి యాప్‌లు
రైతులు దళారుల చేతిలో మోసపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో పత్తి పంట అమ్ముకునేందుకు వీలుగా కపాస్ కిసాన్ యాప్‌ను అందు బాటులోకి తీసుకువచ్చారు. అన్నదాతలకు అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ఇంటి నుంచే యూరియాను బుక్ చేసుకునేందుకు యాప్ ను ప్రయోగాత్మకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
కొత్త పథకాల అమలుకు శ్రీకారం
సేంద్రియ పంటల సాగు విస్తీర్ణం పెంచడమే లక్ష్యంగా జాతీయ సహజ సేంద్రియ సాగు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో సేంద్రియ పద్ధతిలో సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.4 వేలు ఆర్థిక సాయం అందించనుంది. నేషనల్ మిషన్ ఆన్ ఈ డబుల్ ఆయిల్ పథకం ద్వారా కుసుమ, నువ్వులు, పొద్దు తిరుగుడు, సోయా తదితర నూనె గింజల సాగు పెంచేందుకు రైతులకు ఉచితంగా విత్తనాలు అందించి ప్రోత్సహించనుంది. నారాయణఖేడ్‌లో రూ.1.95 లక్షల నిధులతో మట్టి పరీక్ష కేంద్రాన్ని మంజూరు చేసింది.
18 శాతం అధికంగా నమోదు
ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు కురవాల్సిన వర్షం కంటే 18 శాతం అత్యధికంగా వర్షం కురిసింది. జూలైలో 7, ఆగస్టు 131, సెప్టెంబర్ లో 52, అక్టోబర్‌లో 44 శాతం అత్యధికంగా వర్షపాతం కురవగా జూన్, నవంబర్‌లో మాత్రం తక్కువగా నమోదైంది.
పంట నష్టం వివరాలు
విడత రైతులు ఎకరాలు
మొదటి 4706 5548.01
రెండవ 15,590 6797.38
మూడవ 823 7,212
యూరియా కోసం క్యూ లైన్లు, ఆందోళనలు
పంటల సాగులో వినియోగించే యూ రియా కోసం ఈ సంవత్సరం రైతులు పలు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వానాకాలం సీజన్‌లో 38 వేల మెట్రిక్ టన్నుల అవసరాన్ని గుర్తించారు. యూరియా కోసం పలుచోట్ల ఆందోళనలు సైతం చేపట్టారు. క్యూలైన్లలో పడిగాపులు పడ్డారు.
నష్టాల సాగు


