వంటల పోటీలకు స్పందన కరువు
జహీరాబాద్ టౌన్: మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు ఆదివారం పట్టణంలో నిర్వహించిన జిల్లా స్థాయి వంటల పోటీలకు స్పందన కరువైంది. జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన పోటీలు మొక్కబడిగా జరిగాయి. మధ్యాహ్న భోజన పథకం జిల్లా అధికారులు ఈ పోటీలు నిర్వహించారు. పోషకాహారంలో సమతుల్యత, పరిశుభ్రతకు సంబంధించి జరిగిన పోటీలకు స్పందన అంతంత మాత్రంగా వచ్చింది. జిల్లా స్థాయి పోటీలకు కేవలం జహీరాబాద్ పట్టణ పరిసర గ్రామాల నుంచి 8 పాఠశాలలకు చెందిన భోజన నిర్వాహకులు పాల్గొన్నారు. జిల్లాలోని ఇతర పాఠశాలల నుంచి పోటీల్లో ఎవరూ పాల్గొనలేదు. మొక్కుబడిగా పోటీలను నిర్వహించి ముగ్గురికి నగదు బహుమతులను అందజేశారు. పట్టణంలోని యూపీఎస్ నం–3 పాఠశాలకు మొదటి బహుమతి, బాలుర ఉన్నత పాఠశాలకు రెండో బహుమతి, బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాలకు మూడో బహుమతి అందజేశారు.


