రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
మెదక్ కలెక్టరేట్ : రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఇలంబర్తి సూచించారు. శనివారం మెదక్‌కు వచ్చిన ఆయన సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఇతర జిల్లా అధికారులతో రోడ్డు భద్రతపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఇలంబర్తి మాట్లాడుతూ.. ప్రమాదాలు పెరుగుతున్నాయని, ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలు పాటించి వాహనాలు నెమ్మదిగా నడపాలన్నారు. అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, వాహనాల మెయింటెనెన్‌న్స్ లోపాలు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా గుర్తించి, బ్లాక్ స్పాట్ల వద్ద రహదారి లోపాల సమస్యలు లేకుండా చూడాలన్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు, రిఫ్లెక్టర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను తగ్గించాలని పేర్కొన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం, డ్రంకెన్ డ్రైవింగ్‌ను నిషేఽధించడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పాఠశాలలు, గ్రామాల్లో రోడ్డు భద్రతా వర్క్‌షాప్‌లు, సీపీఆర్‌లపై శిక్షణ ఇవ్వాలన్నారు. రోడ్లపై తనిఖీలు, స్పీడ్ గన్‌లు, ఆక్రమణల తొలగింపు చేపట్టాలని రోడ్డు భద్రత మాసంలో ర్యాలీలు, పోటీలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేయాలని చెప్పారు. అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ... జిల్లాలో పకడ్బందీగా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రహదారి, ఆర్టీసీ, పోలీసు, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఇలంబర్తి


